Chandrababu: టీడీపీ నేతకు అఖిలేశ్ యాదవ్ ఫోన్.. చంద్రబాబు అరెస్టుపై సీరియస్ రియాక్షన్
చంద్రబాబు అరెస్టుపై విపక్ష కూటమి నేతలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ చంద్రబాబు అరెస్టు తీరు సరికాదని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా, యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ ఆయన అరెస్టును ఖండించారు. నేరుగా టీడీపీ నేతకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఎక్స్‌లో ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అరెస్టు కలకలం రేపుతున్నది. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నది. ఆయన అరెస్టుపై ఇతర రాష్ట్రాల నేతలు కూడా స్పందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి. చంద్రబాబు అరెస్టుపై ప్రతిపక్ష కూటమి (ఇండియా బ్లాక్) నుంచి నేతలు ఇప్పడిప్పుడే స్పందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఆయన అరెస్టుపై స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.
అఖిలేశ్ యాదవ్ నేరుగా టీడీపీ సీనియర్ నేత యనమలకు ఫోన్ చేశారు. చంద్రబాబు అరెస్టు గురించి, తదనంతర పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన అరెస్టు చట్టవిరుద్ధం అని ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతోనూ మాట్లాడుతానని ఆయన పేర్కొన్నారు.
Also Read: చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆమె ఏమన్నారంటే..
అదే విధంగా ఆయన సోషల్ మీడియా ఎక్స్‌లోనూ ఘాటుగా ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి జైలులో వేసే ధోరణి కేంద్రం నుంచి రాష్ట్రాలకు పాకుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వంతో కలిసి రాని నేతలను అరెస్టు చేయడం, జైలుకు పంపడం నిరంకుశ విధానాలు అని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో వీటికి స్థానం లేదని ఖండించారు.
బీజేపీ, దాని అవకాశవాద మిత్రులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని, వాళ్లు చేస్తున్న ఈ రాజకీయ క్రీడకు రేపు వాళ్లు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్వీట్ చేశారు. స్వార్థపూరిత బీజేపీకి రాజకీయంలో మిత్రులు ఎవరూ ఉండరని కామెంట్ చేశారు. ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేసి ఈ ట్వీట్ చేశారు.
Also Read: ఎవరూ భయపడొద్దు, నేను వస్తున్నాను: ఇక బాలకృష్ణ పరామర్శ యాత్ర
చంద్రబాబు అరెస్టుపై విపక్ష కూటమి నేతలు స్పందిస్తున్నారు. అయితే.. చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల నేపథ్యంలో ఏ కూటమిలోనూ చేరలేదు. అయితే.. ఎన్డీఏ కూటమికి వైసీపీ బయటి నుంచి మద్దతు ఇవ్వడానికి సిద్ధమైంది. చంద్రబాబు కూడా ఎన్డీఏలోకి వెళ్లే ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. కానీ, చివరికి ఆయన ఎందులోనూ చేరలేదు. ఈ తరుణంలో విపక్ష శిబిరం నుంచి ఆయనకు మద్దతు లభిస్తుండటం గమనార్హం.