మండపేట: మండపేటలో రెండు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల జషిత్ దొరికాడంటూ గుర్తు తెలియని వ్యక్తి ఢిల్లీ నుండి బుధవారం నాడు ఫోన్ చేశారు. తన ఖాతాలో రూ. 5వేలు జమ చేస్తే బాలుడిని తీసుకొస్తానని  గుర్తుతెలియని వ్యక్తి జషిత్ తండ్రికి ఫోన్ చేశాడు.

రెండు రోజుల క్రితం  మండపేటలో బ్యాంకు ఉద్యోగి వెంకటరమణ కొడుకు జషిత్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.  కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం నాడు మధ్యాహ్నం జషిత్ తండ్రి వెంకటరమణకు ఢిల్లీ నుండి ఫోన్ చేస్తున్నట్టుగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. 

తనకు జషిత్ దొరికాడని  ఆ వ్యక్తి చెప్పాడు. అయితే వీడియో కాల్ ద్వారా తనకు తన కొడుకును చూపాలని వెంకటరమణ కోరాడు.  అయితే తన ఫోన్‌లో వీడియో కాల్ సౌకర్యం లేదని  వెంకటరమణకు గుర్తు తెలియని వ్యక్తి చెప్పాడు.

తాను ఫేస్‌బుక్ లో  జషిత్ ను చూసినట్టుగా ఆయన తెలిపారు. హోటల్ లో తాను జషిత్ ను గుర్తించి  పాలు తాగిస్తున్నట్టుగా గుర్తు తెలియని వ్యక్తి వెంకటరమణకు చెప్పాడు. 

అయితే ఈ ఫోన్ కాల్‌ను మండపేట పోలీసులు ఫేక్‌గా అనుమానిస్తున్నారు. ఈ ఫోన్ సమాచారాన్ని మండపేట పోలీసులు ఢిల్లీ పోలీసులకు పంపారు. ఢిల్లీ పోలీసులు ఈ ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

మండపేట బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి.. నిందితుల గుర్తింపు

మండపేటలో బాలుడి కిడ్నాప్: ఇంకా దొరకని ఆచూకీ