ఎప్పుడూ అధికార పార్టీ నాయకులతో బిజీ బిజీగా వుండే తాడేపల్లిలోని వైసిపి కార్యాలయం వద్ద ఓ కారు పార్క్ చేసి వుండటం కలకలం రేపుతోంది.
అమరావతి : అధికార వైసిపి కార్యాలయం వద్ద ఓ కారు కలకలం రేపింది. తమను కోట్లాది రూపాయలు మోసం చేసారని... న్యాయం చేయాలంటూ ఓ కారు చుట్టూ పేపర్లు అతికించారు. ఈ కారును తాడేపల్లిలోని వైసిపి కార్యాలయం వద్దకు తీసుకొచ్చిపెట్టారు గుర్తుతెలియని వ్యక్తులు. దీంతో పార్టీ కార్యాలయానికి వెళ్లే వైసిపి నాయకులతో పాటు అటువైపు వెళ్లే ప్రజలు కూడా ఈ కారును ఆసక్తిగా గమనిస్తున్నారు.
కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు చెందిన మల్లికార్జున్ రెడ్డి తమను రూ.16 కోట్లు మోసం చేసాడంటూ రెనాల్ట్ క్విడ్ కారుచుట్టూ పేపర్లు అతికించారు. గతంలో సీఎం జగన్ ను మల్లికార్జున్ రెడ్డి కలిసిన ఓ ఫోటోను కూడా కారుకు అతికించారు. వైసిపి వాళ్లచేతిలో కోట్లలో ఆస్తిని కోల్పోయామని... మీ పార్టీకి చిత్తశుద్ది వుంటే దొంగను పట్టుకోవాలంటూ కారు ముందు పేపర్లు, పోటోలు అతికించారు.
వీడియో
'16 కోట్ల రూపాయల ఆస్తి మోసం చేశారు. జగనన్నా... మీరే న్యాయం చేయాలని కోరుచున్నాను. లేకపోతే మాకు ఆత్మహత్యే శరణ్యం. అందుకోసమైనా అనుమతి ఇవ్వండి' అని కోరుతూ కారు విండోలకు, వెనకభాగంలో మరికొన్ని స్టిక్కర్లు అతికించారు. కారు ముందు బానెట్ పై కాల్ మీ అంటూ 9502926700 మొబైల్ నంబర్ రాసిపెట్టారు. ఈ కారును వైసిపి కేంద్ర కార్యాలయం వద్ద వుంచి వినూత్నంగా తమ బాధను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు గుర్తుతెలియని వ్యక్తులు.
