షాక్.. ఎన్డీయేలోకి వైసీపీ

Union Minister Ramdas Athawale Invites YSR Congress to NDA
Highlights


ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన టీడీపీ.. ఇప్పుడు వైసీపీకి ఆహ్వానం

వైసీపీ అధినేత జగన్ పై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ప్రశంసల వర్షం కురిపించారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన జగన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి  అన్ని విధాలా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు.  

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలూ కేంద్రంపై ఒత్తిడి తెస్తాయని పేర్కొన్నారు. టీడీపీ ఎన్డీయే కూటమిలో నుంచి బయటకు రావడం బాధాకరమన్నారు. టీడీపీ మళ్లీ ఎన్డీయేలోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 

వైసీపీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో బలమైన పార్టీ అని.. ఎన్డీయేలో చేరాలని ఆ పార్టీ అధినేత జగన్‌ను ఆహ్వానిస్తున్నానని అన్నారు.ఈ సందర్భంగా జగన్‌పై ఉన్న కేసుల గురించి ప్రస్తావిస్తూ.. జగన్‌పై ఉన్న కేసుల్లో ఏవీ ఇంకా నిరూపితం కాలేదని రాందాస్‌ అథవాలే చెప్పుకొచ్చారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పు సమంజసంగా లేదని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. అట్రాసిటీ కేసుకు సంబంధించి భాజపా కూడా రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిందని తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చాలని.. మిగిలిన కులాలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
 
కాగా.. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశం అవుతున్నాయి. వైసీపీతో లోపాయికారీ ఒప్పందంతోనే కేంద్రం ఏపీని పట్టించుకోవట్లేదన్న టీడీపీ చేస్తున్న ఆరోపణలకు రాందాస్‌ అథవాలే కామెంట్లు బలం చేకూర్చేలా కనబడుతున్నాయి. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

loader