విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణలివే: నిర్మలా సీతారామన్
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ నష్టాలకు ప్రత్యక్ష,పరోక్ష వ్యయాలు అప్పులపై అధిక వడ్డీలు తక్కువ ఉత్పాదకత వినియోగ సామర్ధ్యమే ప్రధానకారణాలుగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ నష్టాలకు ప్రత్యక్ష,పరోక్ష వ్యయాలు అప్పులపై అధిక వడ్డీలు తక్కువ ఉత్పాదకత వినియోగ సామర్ధ్యమే ప్రధానకారణాలుగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
లోక్‌సభలో వైసీపీ ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకొని 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టామన్నారు.
ప్రైవేటీకరణకు లాభనష్టాలు కొలమానం కాదని ఆమె తెలిపారు. ప్రైవేటీకరణ ద్వారా సమకూరిన వనరులను వివిధ సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడమే ప్రధాన ఉద్దేశమని ఆమె తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ఆర్ధికసంస్థల్లో ఉపసంహరణ, ప్రైవేటీకరణ, మైనార్టీ వాటాల విక్రయం ద్వారా 2021-22 లో 1.75 లక్ష కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకొన్న విషయాన్ని నిర్మలా సీతారామన్ తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.