విజయవాడ: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్ిడ ఆదివారం ఉదయం శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి అమ్మవార్ల ను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఆలయ ఈఓ ఎంవి సురేష్ బాబు, ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్,  తదితరులు స్వాగతం పలికారు..

అనంతరం అమ్మవారి దర్శనాన్ని కల్పించి, అమ్మవారి ప్రసాదాన్ని అందచేశారు. కేంద్ర మంత్రి వెంట  ఎంపీ ఙివిఎల్ నరసింహరావు, ఎమ్ఎల్సీ మాధవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, తదితరులు ఉన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి దర్శనం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

కరోనా మహమ్మారి నుంచి ప్రజలు అందరూ బయటపడాలని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు. పాడి పంటలు, సుఖః సంతోషాలతో ప్రజలు ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. ప్రపంచ దేశాలకు దీటుగా భారత్ ఎదగాలని అమ్మవారిని  కోరుకున్నానని కిషన్ రెడ్డి చెప్పారు. 

తెల్లవారు జామునుంచే పెద్ద ఎత్తున భక్తులు దుర్గమ్మ దర్శనానికి రావడం ప్రారంభించారు. భవానీ మాలదారులతో, భక్తులతో అమ్మ శరణ ఘోషతో ఇంద్రకీలాద్రిపై ఆలయ ప్రాంగణం హోరెత్తుతోంది.