విజయనగరం: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మత్స్య పరిశ్రమ, పశు సంవర్థక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో పర్యటించిన గిరిరాజ్ సింగ్ దేశంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కొనియాడారు.  

మత్స్య పరిశ్రమ అభివృద్ధిని చూసి ఏపీ మత్స్య పరిశ్రమలో రూ.25వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు స్పష్టం చేశారు. భోగాపురంలో రొయ్య పిల్లల ఉత్పత్తి పరిశ్రమ వైశాఖీ బయో రిసోర్సెస్‌ను సందర్శించారు.  

మత్స్య పరిశ్రమ ద్వారా ప్రస్తుతం రూ.47,000 కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ ఎగుమతులను లక్ష కోట్లకు పెంచడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. 

మత్స్య ఉత్పత్తుల్లో రసాయనాలు వినియోగించడం తగ్గించాలని రైతులకు కేంద్ర మంత్రి సూచించారు. ఇక నుంచి రొయ్యలకు సర్టిఫికేషన్ కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోనే సర్టిఫికేషన్ సదుపాయాలు కల్పించనున్నట్లు హమీ ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌లో హెక్టారుకు సగటు రొయ్యల ఉత్పత్తి మూడు టన్నులుగా ఉందన్న ఆయన దానిని తొమ్మిది టన్నులుకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. 

వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. అందువల్లే వ్యవసాయ శాఖ నుంచి విడదీసి పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖలను వేరే శాఖగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.