అమరావతి: పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు నిజమేనని కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎన్నికల లోపు పూర్తి చేసి నీరివ్వాలని సర్కార్ భావిస్తోంది. ఈ తరుణంలో  కేంద్రమంత్రి చేసిన ప్రకటన బాబు సర్కార్‌కు షాక్ కల్గిస్తోంది.

సోమవారం నాడు రాజ్యసభలో  వైసీపీ ఎంపీ  విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి మేఘ్ వాల్  సమాధానమిచ్చారు.కొందరు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం  చెల్లించిన డబ్బులను తిరిగి రాబట్టాలని  పీపీఏ సూచించినట్టుగా  మేఘ్‌వాల్ గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవకతవకలు చోటు చేసుకొన్నాయని విపక్షాలు  ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వైసీపీ, బీజేపీ నేతలు ఈ విషయమై పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు  చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  రాజ్యసభలో వేసిన ప్రశ్నకు మంత్రి  సమాధానమిచ్చారు.