అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఆందోళనకర పరిస్థితిలో పడింది. గత నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తీసుకున్న వైఖరి వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సందేహంలో పడింది. రాష్ట్ర విభజనలో భాగంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం చేపట్టాల్సి ఉంది. అయితే, గత చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలను తీసుకుంది. నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. 

అయితే, దానికి కేంద్రం కొర్రీ పెట్టింది. 2016 కేంద్ర ఆర్థిక శాఖ మెమో ప్రకారమే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. తాము నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని, పునరావాసానికి నిధులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులను సమకూర్చే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ లేదు. 

కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 4500 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. పునరావాసానికి 33 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇప్పటి వరకు 20 శాతం పునరావాస ఖర్చులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఇంకా 29 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది. 

ఈ స్థితిలో జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని ఆలోచన చేస్తోంది. రాష్ట్రానికి చెందిన ముఖ్య కార్యదర్శులను ఢిల్లీకి పంపించి పునరావాస నిధుల కోసం ప్రయత్నాలు సాగించనుంది. లేని స్థితిలో పోలవరం ప్రాజెక్టును తాము చేపట్టబోమని, కేంద్రమే ఆ బాధ్యత తీసుకోవాలని అడగనుంది. 

ప్రస్తుత అంచనాలతో తాము ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టబోమని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన ఒప్పందాన్ని సాకుగా తీసుకుని కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిధులపై కొర్రీలు పెడుతోందని ఆయన అన్నారు.

మరోవైపు, పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం స్పష్టతతో ఉందని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు.