అమరావతి:  కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి విషయమై కేంద్రం ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద మూడో ఏడాది తొలివిడతగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ కార్యక్రమాన్ని సీఎం జగన్ గురువారం నాడు అమరావతి క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించారు.  కోవిడ్‌తో యుద్దం చేస్తూనే సామాన్య జీవితం గడపాల్సిన పరిస్థితులున్నాయని ఆయన చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసునని చెప్పారు.  దేశంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వడానికి 172 కోట్ల డోసులు అవసరమౌతాయన్నారు.  

అయితే కేంద్రం ఇప్పటివరకు 18 కోట్ల డోసులు మాత్రమే సరఫరా చేసిందన్నారు. ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారికి 7 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం 73 లక్షలు మాత్రమే ఇచ్చిందని ఆయన చెప్పారు.  దేశంలోని రెండు వ్యాక్సిన్ కంపెనీలు 7 కోట్ల డోసులను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయన్నారు.  కరోనాతో మనమంతా సహజీవనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 23 నెలల పాలనలో రైతులకు రూ. 68 వేల కోట్ల సహాయం అందించినట్టుగా ఆయన చెప్పారు,  ఇప్పటివరకు రైతులకు రైతులకు  వైఎస్ఆర్ రైతు భరోసా కింద నగదు బదిలీ పథకం కింద రూ.13,101 కోట్లు జమ చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. పగటిపూట ఉచిత విద్యుత్తు కోసం రూ. 1700 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.