విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరో సవాల్ విసిరారు. రెండు రోజుల క్రితం శ్వేతపత్రాలపై చర్చించేందుకు తాను సిద్ధమని ప్రభుత్వం నుంచి ఎవరైనా సిద్ధమా అంటూ ఆయన రాజమహేంద్రవరంలో సవాల్ విసిరారు. 

దానిపై తెలుగుదేశం పార్టీ కానీ సీఎం చంద్రబాబు కానీ స్పందించలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన శ్వేతపత్రం అంటేనే చర్చ అలాంటిది చర్చలకు ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. శ్వేతపత్రాలపై చర్చ రాజకీయ పార్టీలతో కాకుండా ఐఏఎస్ అధికారులతో చేయించాలంటూ మరో సవాల్ విసిరారు. 

అన్ని విషయాలు ప్రజలకు తెలిసేలా చెయ్యండంటూ ఉండవల్లి మితవు పలికారు. తాను చేసిన ఆరోపణలపై స్పందించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును మే నెలలో పూర్తి చేసి నీళ్లు ఇస్తామంటున్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన సెటైర్లు వేశారు. మే నెలలో నీళ్లు ఉండవని ఉండవల్లి గుర్తు చేశారు. ప్రాజెక్టు మెుత్తం పూర్తయినా అప్పుడు కూడా నీళ్లుండవంటూ స్పష్టం చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ .