రాజమహేంద్రవరం: ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు క్రెడిట్ వస్తుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు చివరి ఏడాది ప్రత్యేక హోదాపై పోరాటం అంటూ ఫీట్లు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ మొదటి నుంచీ పోరాటం చే్సతున్నారని, జగన్ బాటలోకి ప్రతిపక్షాలన్నీ వచ్చాయని, హోదా సెంటిమెంటుగా మారిందని, రాష్ట్రానికి హోదా అవసరమని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారని ఆయన చెప్పారు. 

"రాష్ట్రం వెలిగిపోతుంది, 2029కి ముందే ప్రపంచంలో నంబర్ వన్ రాష్ట్రం అవుతుంది. గుజరాత్ కన్నా మనం ముందుకు పోతాం కాబట్టే అణచివేస్తున్నారు. జీడీపిలో దేశం కన్నా మనమే టాప్" అంటూ చంద్రబాబు ఫోజులు కొడుతుంటే అంతా బాగున్నవారికి హోదా ఎందుకని ఎవరైనా అనుకుంటారని ఉండవల్లి అన్నారు. దేబిరించాల్సిన సమయంలో కాలు మీద కాలేసుకుని ఫోజులు కొడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

విభజనకు సంబంధించి లోకసభ శీతాకాలం సమావేశాల్లో నోటీసులిస్తే రాష్ట్రానికి జరిగన అన్యాయానికి మీరంటే మీరే కారణమంటూ బిజెపి, కాంగ్రెసు దుమ్మెత్తిపోసుకుంటాయని, దానివల్లనైనా రాష్ట్రానికి జరిగిన అన్యాయం దేశం మొత్తం తెలుస్తుందని అన్నారు.

విభజన సమయంలో లోకసభలో జరిగిన వ్యవహారంపై వచ్చే శీతాకాలం సమావేశాల్లో నోటీసులు ఇవ్వాలని, విభజనపై తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతూ ఆయన చంద్రబాబుకు రాసిన లేఖను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. 

ప్రత్యేక హోదాతో ఏం వస్తుందనీ.. హోదా ఏమైనా సంజీవినా అని నాలుగేళ్లుగా చంద్రబాబు అంటూ వచ్చారని ఆయన గుర్తు చేసారు. ఎన్నికలకు ఏడాది గడువు ఉన్న సమయంలో ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం తానే పోరాడుతున్నానని 11 చానళ్ల ద్వారా ప్రచారం చేయించుకుంటున్ారని 25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తామంటున్నారని, బిజెపి అప్పుడు కేంద్రంలో అధికారంలోనో ప్రతిపక్షంలోనో ఉంటుందని, చంద్రబాబుపై కక్షతో ఇప్పుడు అడ్డుకుంటే రేపు కూడా అడ్డుకోదా అని ఉండవల్లి అన్నారు.