వివేకాను చంపినట్టు చంపుతామన్నారు: ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉమా శంకర్ రెడ్డి భార్యకు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తరహలోనే తన భర్తను హత్య చేస్తానని బెదిరింపులకు దిగారని ఉమాశంకర్ రెడ్డి భార్య ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా ఆమె చెప్పారు.
శనివారం నాడు తన ఇంటికి పరమేశ్వర్ రెడ్డి ఆయన కొడుకు వచ్చి బెదిరింపులకు పాల్పడినట్టుగా ఉమాశంకర్ రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇష్టమొచ్చినట్టుగా పరమేశ్వర్ రెడ్డ బూతులు తిట్టారని ఆమె చెప్పారు. ఈ విషయమై తాను తన బంధువులకు ఫోన్ చేస్తే తన ఫోన్ ను లాక్కొని తనను వెనక్కి నెట్టివేశారన్నారు. దీంతో తాను కిందపడిపోయినట్టుగా ఉమాశంకర్ రెడ్డి భార్య చెప్పారు.
తనపై దాడి చేస్తున్న సమయంలో తప్పించుకొని మరో గదిలో దాక్కున్నట్టుగా ఆమె మీడియాకు చెప్పారు. ఇరుగు పొరుగు వారు పరమేశ్వర్ రెడ్డిని పంపించినట్టుగా స్వాతి తెలిపారు. ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఆమె తెలిపారు. తన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారన్నారు. తమ కుటుంబానికి ఏమైనా జరిగితే పరమేశ్వర్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. జైలు నుండి తన భర్త ఉమాశంకర్ రెడ్డి బయటకు రాగానే వివేకానందరెడ్డిని హత్య చేసినట్టుగానే చంపుతామని పరమేశ్వర్ రెడ్డి బెదిరించారని ఆమె చెప్పారు.
నిన్ను చంపితే నీకు దిక్కెవరని కూడా పరమేశ్వర్ రెడ్డి బెదిరింపులకు దిగినట్టుగా ఆమె మీడియాకు తెలిపారు. తన పిల్లలు హస్టల్ లో ఉంటున్నారని చెప్పారు.తమది ఉమ్మడి కుటుంబమని ఆమె తెలిపారు. తమ కుటుంబంలో 15 మంది ఉంటామన్నారు. మా కుటుంబంలో ఎవరికి ఏమైనా పరమేశ్వర్ రెడ్డిదే బాధ్యతగా ఆమె పేర్కొన్నారు. తాను ఒక్కదాన్నే ఈ ఇంట్లో ఉంటున్నానని ఆమె చెప్పారు. పరమేశ్వర్ రెడ్డి వచ్చి బెదిరింపులకు పాల్పడడంతో తనకు భయంగా ఉందన్నారు.
also read:వివేకా హత్య కేసు.. వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు..
2019 మార్చి 19వ తేదీన పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని దుండగులు హత్య చేశారు.ఈ కేసులో సీబీఐ అధికారులు ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఉమాశంకర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ఈ కేసును తెలంగాణ రాష్ట్రంలోని ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు విచారిస్తుంది.
ఈ కేసులో విచారణకు రావాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు కచ్చితంగా విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.