హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెలరోజులు గడవక ముందే భారీ ప్రాజెక్టును రాయలసీమకు అందించనున్నారు. 

జగన్ చొరవతో కర్నూలు జిల్లాలో భారీ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ముందుకు వచ్చారు ఆదిత్యా బిర్లా గ్రూప్ సంస్థ కుమారమంగళం బిర్లా. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో అఖండ విజయం సాధించిన అనంతరం వైయస్ జగన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు వెళ్లారు. 

ఆ సందర్భంలో కుమారమంగళం బిర్లా వైయస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రంలో అల్ట్రాటెక్ సిమ్మెంట్ ప్లాంట్ పెట్టాలంటూ జగన్ ఆహ్వానించారు. దీంతో రంగంలోకి దిగిన కుమార మంగళం బిర్లా ఏపీలో సిమ్మెంట్ ప్లాంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

అందుకు సంబంధించి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులకు అప్లై చేయడంతో అందుకు గ్రీన్ సిగ్నల్ సైతం లభించింది. ఇకపోతే భారత్ లోనే అతిపెద్ద సిమ్మెంట్ కంపెనీ అయిన అల్ట్రాటెక్ సిమ్మెంట్ ప్లాంట్  కర్నూలు జిల్లా పెట్నికోట వద్ద ఏర్పాటు చేయబోతున్నారు. 

రూ.2,500 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును నెలకొల్పనుంది ఆదిత్యా బిర్లా కంపెనీ. ఇప్పటికే కంపెనీ 431.92 హెక్టార్ల స్థలాన్ని ప్లాంటు కోసం కొనుగోలు చేసింది. ప్రతిపాదిత ప్రాజెక్టులో భాగంగా 40 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో క్లింకర్‌ యూనిట్, 60 లక్షల టన్నుల సామర్థ్యంతో సిమెంటు తయారీ కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. 

అలాగే ప్లాంటు అవసరాల కోసం 60 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంటుతోపాటు తయారీ ప్రక్రియలో జనించే వేడి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 15 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టు కూడా రానుంది. 1000 మందికి ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి లభించనుంది. 

ప్రాజెక్టు ఏర్పాటు నిర్వహణకై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి అల్ట్రాటెక్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కర్నూలు జిల్లాకు భారీ స్థాయిలో కంపెనీ రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.