గుంటూరు: సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అసభ్యకర పోస్టులుపెట్టిన ఇద్దరు యువకులు కటకటాలపాలయ్యారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని కుంకలగుంట గ్రామానికి చెందిన అశోక్, నిరీక్షణ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి, మంత్రులపై ఇటీవల కొందరు సోషల్ మీడియా వేదికన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇలా తప్పుడు ప్రచారాలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఫేస్ బుక్ లో ముఖ్యమంత్రి జగన్ పై ఓ అసభ్యకర పోస్టు వైరల్ గా మారింది. ఇది వైసిపి నాయకుల దృష్టికి వెళ్లగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వైసిపి నాయకుల ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పి.అశోక్, జి.నిరీక్షణరావు మొదట ఈ పోస్ట్ చేసినట్లు గుర్తించారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇలా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.