ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇద్దరు తెలంగాణ వ్యక్తులు దారుణహత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మేళ్లవాయి గ్రామానికి చెందిన వేముల లక్ష్మయ్య, వేముల సురేశ్‌లు తండ్రికొడుకులు.

వీరు అమరావతిలో రాజధాని రోడ్ల నిర్మాణం చేస్తున్న మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి తమ ప్రొక్లయినర్‌ను అద్దెకి ఇచ్చారు. ఈ క్రమంలో పనులను పరిశీలించేందుకు మూడు రోజుల క్రితం రాజధానికి వచ్చారు. తమ ప్రొక్లెయినర్‌కు జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకున్నారు.

అయితే రెండు రోజులుగా లక్ష్మయ్య, సురేశ్‌తో పాటు డ్రైవర్‌లు కనిపించకుండా పోయారు. అనుమానం వచ్చిన తోటి కార్మికులు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు ప్రాంతంలో తవ్వగా తండ్రికొడుకుల మృతదేహాలు బయటపడ్డాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రొక్లెయినర్ డ్రైవరే ఇద్దరినీ చంపి పూడ్చి పెట్టి ఆ తర్వాత పారిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.