కరోనా వైరస్ దేశవ్యాప్తంగా తీవ్రరూపం దాలుస్తోంది.  ఊహించని విధంగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఎవరికి ఎటునుంచి కరోనా సోకుతుందో అర్థం కావడం లేదు. కొందరిలో కరోనా సోకినా.. కనీసం లక్షణాలు కూడా కనిపించడం లేదు. దీంతో.. ప్రజల్లో కంగారు పెరిగిపోతోంది. 

అయితే.. పలు చోట్ల కరోనా రిపోర్టులు తారుమారు అవుతున్నాయి. ఈ క్రమంలో మరింత గందరగోళం నెలకొంటోంది. తాజాగా ఇలాంటి సంఘటనే కర్నూలులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నంద్యాల మండలం గోస్పాడు మండలానికి చెందిన 40 ఏళ్ల మహిళ విషయంలో ఇదే జరిగింది. ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున 2.46 నిమిషాలకు ఆమె దగ్గు, తీవ్ర ఆయాసంతో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చింది. ఆమెకు ముందుగా ట్రూనాట్‌(కరోనా) పరీక్ష చేశారు. 

అందులో ఆమెకు కరోనా లేదని వచ్చింది. అయితే, ఆమెకు కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండటంతో అనుమానంతో వైద్యులు   ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షకు స్వాబ్‌ తీసి పంపించారు. ఈలోగా చికిత్స పొందుతూ ఆమె మధ్యాహ్నం మృతి చెందారు.

చికిత్స సమయంలోనే ఆమెకు కరోనా పాజిటివ్‌గా నివేదిక వచ్చింది. అయితే, ఆమె వివరాలను కలెక్టరేట్‌కు పంపించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తోంది. మృతురాలి పేరుతోనే కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన మహిళ కూడా ఉండటంతో ఆమె పేరున వివరాలు పంపించారు. 

వాస్తవానికి బుధవారపేట మహిళకు కరోనా నెగిటివ్‌ వచ్చింది. అయితే, ఈమెకు పాజిటివ్‌ ఉన్నట్లు కలెక్టరేట్‌కు సమాచారం పంపి ఫోన్‌ నెంబర్‌ మాత్రం గోస్పాడుకు చెందిన మృతురాలి కుటుంబీకులది ఇచ్చారు.

దీంతో.. కరోనా సోకిన వ్యక్తికి నెగిటివ్ గాను... కరోనా లేని మహిళకు పాజిటివ్ గానూ సమాచారం అందడంతో గందరోగళం నెలకొంది. కాగా.. చాలా ఆలస్యంగా దీనిని అధికారులు గుర్తించారు.