కర్నూల్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పుల్లూరు చెక్‌పోస్టు వద్ద  అంబులెన్స్ లోనే ఇద్దరు రోగులు శుక్రవారం నాడు మృతి చెందారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలోని ఆసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చే  రోగులకు ప్రత్యేకమైన మార్గదర్శకాలను  విడుదల చేసింది కేసీఆర్ సర్కార్. గురువారం నాడు రాత్రి ఈ మార్గదర్శకాలను తెలంగాణ సర్కార్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయడంంతో సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అనుమతి ఉన్న వాహనాలు, రోగులకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు. తెలంగాణలో వైద్య చికిత్స కోసం ఏపీ నుండి వస్తున్న రోగులు అనుమతి లేకుండా  ప్రవేశించే ప్రయత్నం చేయడంతో తెలంగాణ పోలీసులు నిలిపివేశారు. 

also read:సరిహద్దుల్లో కఠినంగా ఆంక్షలు: అనుమతి ఉంటెనే తెలంగాణలోకి ఎంట్రీ

ఇవాళ ఉదయం నుండ కర్నూల్‌ నగరానికి సమీపంలోని ఏపీ తెలంగాణ సరిహద్దుల్లోని పుల్లూరు చెక్‌పోస్టు వద్ద అనుమతి లేని అంబులెన్స్ , వాహనాలను  తెలంగాణ పోలీసులు నిలిపివేశారు.  దీంతో చెక్‌పోస్టు వద్ద భారీగా అంబులెన్స్ లు నిలిచిపోయాయి. సకాలంలో వైద్యం అందని కారణంగా   అంబులెన్స్ లోనే  ఇద్దరు  రోగులు మరణించారు.  హైద్రాబాద్‌ ఆసుపత్రుల్లో  ఆడ్మిషన్ కు సంబంధించిన పత్రాలను చూపితేనే అనుమతి ఇస్తున్నారు.