హైదరాబాద్:  రాష్ట్ర సరిహద్దుల్లో  ఆంక్షలను  కఠినంగా అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల్లోని తెలంగాణలో వైద్య చికిత్స కోసం వచ్చే వారికి ప్రత్యేక మార్గదర్శకాలను  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు రాత్రి విడుదల చేసింది. ఇతర రాష్ట్రాల  నుండి  తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం  ఆంక్షలను అమలు చేస్తోంది. వైద్య చికిత్స కోసం  రాష్ట్రంలోకి వచ్చే రోగుల కోసం  ప్రత్యేకంగా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో చికిత్స కోసం వచ్చే రోగులు ఆయా ఆసుపత్రుల నుండి  అనుమతి ఉందని సరిహద్దుల్లో ఉన్న పోలీసులకు ధృవీకరణ పత్రాలను చూపితేనే  రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు. 

also read:ఈ నిబంధనలు పాటిస్తేనే అనుమతి: పొరుగు రాష్ట్రాల వారికి తెలంగాణ సర్కార్ గైడ్‌లైన్స్

రాష్ట్రంలోకి అంబులెన్స్ లను, రోగులను అనుమతించడకపోవడంపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మూడు రోజుల క్రితం సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయమై లిఖిత పూర్వకమైన ఆదేశాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. అయితే  మౌఖిక ఆదేశాలు మినహా లిఖిత పూర్వక ఆదేశాలు లేవని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అంబులెన్స్‌లను రాష్ట్రంలోకి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గురువారం నాడు రాత్రి విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సరిహద్దుల్లో తెలంగాణ సర్కార్  కఠినంగా ఆంక్షలను అమలు చేస్తోంది.