Asianet News TeluguAsianet News Telugu

కర్నూలులో కరోనా కల్లోలం: మరో ఇద్దరు డాక్టర్లకు పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో ఇద్దరు వైద్యులకు కరోనా వైరస్ సోకింది. దీంతో కర్నూలు జిల్లాలో ఆరుగురు వైద్యులు కరోనా బారిన పడ్డారు.

Two more doctors infected with Coronavirus in Kurnool district
Author
Kurnool, First Published Apr 25, 2020, 11:19 AM IST

కర్నూలు: కర్నూలు జిల్లాలో మరో ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఓ పీజీ వైద్య విద్యార్థినికి, మరో వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కర్నూలు జిల్లాలో మొత్తం ఆరుగురు వైద్యులకు కరోనా వైరస్ సోకింది. 

కరోనా వైరస్ కర్నూలు జిల్లాలో విజృంభిస్తోంది. శుక్రవారంనాటి లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 261కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి. ఒక్క కర్నూలు నగరంలోనే 140 కరోనా కేసులు నమోదయ్యాయి. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్నూలు జిల్లాలో రాజకీయాలు కూడా వేడెక్కాయి. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. 

కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి ప్రజలను భయకంపితుల్ని చేస్తోందని, ఈ జిల్లాపై  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టవలసిన పరిస్థితులు ఈ జిల్లాలో కనిపిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 

ఈ వ్యాధి కర్నూలు జిల్లాలో వ్యాప్తి చెందడానికి కారణాలు, తప్పులను అన్వేషించడంలో జనసేన పార్టీకి ఎటువంటి ఆసక్తి లేదని ప్రజల ఆరోగ్యమే జనసేన ఆకాంక్ష అని ఆయన అన్నారు. ఈ  సమస్య మనందరిదని ఆయన అన్నారు. అందువల్ల  రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తోందని చెప్పారు. 

ఈ జిల్లాలో ఈ క్షణం వరకు అందిన సమాచారం ప్రకారం 203 కేసులు నమోదు అయ్యాయని, అయిదుగురు చనిపోయారని, నలుగురు రోగులు కోలుకుని ఇళ్లకు వెళ్లారని ఆయన అన్నారు. ఇన్ని కేసులు ఈ జిల్లాలో నమోదవడం పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో తెలుపుతోందని పవన్ కల్యాణ్ ్న్నారు. అందువల్ల కర్నూలు  జిల్లాకు  ప్రత్యేక బృందాల్ని పంపాలని ఆయన కోరారు. 

ప్రత్యేక వ్యూహంతో వ్యాధి ఉదృతిని అరికట్టి, ప్రజలలో మనోధైర్యాన్ని నింపాలని సూచించారు. వ్యాధి నివారణలో ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. వ్యాధి నివారణకు  ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు పని చేస్తున్న వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు అవసరమైనన్ని రక్షణ కిట్లు, ఇతర అవసరాలు సమృద్ధిగా అందించాలని సూచించారు. 

ఇప్పుడు కూడా  మేల్కొనకపోతే  ఈ వ్యాధి ఉదృతి ఈ జిల్లాలో చేయి దాటే ప్రమాదం వుందని, ఈ జిల్లాలో పరిస్థితిపై జనసేన స్థానిక నాయకులతోపాటు సీనియర్ రాజకీయవేత్త, బి.జె.పి.నాయకులు శ్రీ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా వ్యాధి తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ  తనకు లేఖలు పంపారని, ఈ జిల్లావాసుల ఆందోళన తక్షణం  తీర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుందని పవన్ కల్యాణ్ అన్నారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మొత్తం కేసులు వేయికి చేరువలో ఉన్నాయి. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీలో 955కు చేరుకుంది. మరణాల సంఖ్య 29కి చేరుకుంది. తాజాగా గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios