తమ తల్లికి ఇద్దరితో అక్రమ సంబంధం ఉందని.. వాళ్లతో కలిసి కన్న తల్లే తమను చిత్ర హింసలకు గురిచేసిందని ఇద్దరు మైనర్ బాలురు చెప్పడం విషాదకరం. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఇద్దరు మైనర్ బాలురు సోమవారం రూరల్ ఎస్పీ వద్దకు వచ్చారు. కన్న తల్లిపైనే వారు ఫిర్యాదు చేయడం గమనార్హం. వారు తెలిపిన వివరాల ప్రకారం...

‘ మాది నరసరావుపేట. అమ్మా నాన్నలకు మేమిద్దరం సంతానం. 2014 డిసెంబరులో నాయనమ్మ చనిపోయింది. 2015 జనవరి 23న తండ్రి చనిపోయాడు. తండ్రి, నాయనమ్మ బతికున్నంత వరకు తల్లిబాగానే చూసుకునేది. తండ్రి చనిపోయిన దగ్గర నుంచి తల్లి మమ్మల్ని సరిగా పట్టించుకునేది కాదు. షేక్‌ రహీం అనే వ్యక్తితో మా తల్లి సహజీవనం చేసేది. రహీం ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. అతడి స్నేహితుడు కొత్తపల్లి ప్రమోద్‌ కూడా మా తల్లికి పరిచయం అయ్యాడు. ఆ తరువాత ప్రమోద్‌ కూడా ఇంటికి వచ్చేవాడు. వారిద్దరూ కలిసి మమ్మల్ని తీవ్రంగా కొట్టేవారు.

Also Read పదహారేళ్ల అమ్మాయి మృతి: రేప్, హత్య అనుమానం, సహ విద్యార్థి పనే...
 
గత ఏడాది ఫిబ్రవరి నుంచి స్కూల్‌కు కూడా పంపడం లేదు. ఏడాది నుంచి ఇంట్లోనే నిర్బంధించి వేధించారు. ఈ నెల 24న మా తల్లి, ప్రమోద్‌ గొడవ పెట్టుకుని ఆ కోపంతో మీ వల్లే మా మధ్యలో గొడవలు వస్తున్నాయని మమ్మల్ని కొట్టి ఇంటి నుంచి గెంటివేశారు. ఇంటి పక్క షాపులో వారి వద్ద రూ.100 అప్పు తీసుకుని అమ్మమ్మ ఇంటికి వచ్చాం. మమ్మల్ని చిత్ర హింసలు పెట్టడంతో పాటు చదివించకుండా, తిండి పెట్టకుండా వెట్టిచాకిరి చేయించిన మా తల్లిపైన, రహీం, ప్రమోద్‌లపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. వారి నుంచి మాకు ప్రాణ రక్షణ కల్పించాలి...’’ అని ఆ ఇద్దరు చిన్నారులు వేడుకున్నారు.

చిన్నారులు చెప్పిన విషయాలను పూర్తిగా విన్న పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.