కడప జిల్లాలో ఘోరం... రెండు స్కూటీలు ఢీకొని ఇద్దరు దుర్మరణం, మరో ఇద్దరికి గాయాలు
రెండు స్కూటీలు ఢీకొని రోడ్డుపై పడిపోయిన ఇద్దరి పైనుండి లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

కడప : గత రాత్రి కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు స్కూటీలు ఢీకొని ఇద్దరు మృత్యువాతపడగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. సమయానికి చికిత్స అందడంతో క్షతగాత్రులకు ప్రాణాపాయం తప్పింది.
ఈ ఘోరప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా అట్లూరు మండలం గాండ్లపల్లెకు చెందిన చిన్న పెంచలయ్య, రామ్ కుమార్ లు నిన్న(గురువారం) స్కూటీపై బయటకు వెళ్ళారు. అయితే రాత్రి బద్వేల్ మండలం కొంగలపాడు సమీపంలో వీరు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై వేగంగా వెళుతుండగా మరో స్కూటీ వీరిని ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలపై వున్న నలుగురు రోడ్డుపై పడిపోయారు. ఇదే సమయంలో వెనకనుండి వేగంగా వచ్చిన లారీ పెంచలయ్య, రామ్ ల పైనుండి దూసుకెళ్లింది. దీంతో ఆ ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి రోడ్డుపై పడివున్న క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలికి చేరుకున్న వారు మృతదేహాలను పరిశీలించారు. బైక్ నెంబర్ ఆధారంగా మృతుల వివరాలు సేకరించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పెంచలయ్య, రామ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.
Read More తల్లిని చంపి, నాలుక కోసి.. పీఎస్ కు తీసుకెళ్లిన కొడుకు...
ఈ యాక్సిడెంట్ పై బద్వేల్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులతో పాటు ప్రత్యక్ష సాక్షుల నుండి ప్రమాద వివరాలను తెలుసుకుంటున్నారు. లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో వున్నట్లు తెలుస్తోంది.