గుంటూరు జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి..
గుంటూరు జిల్లాలో మేడికొండూరు మండలం మందపాడులో విషాదం చోటుచేసుకుంది. పొలంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందారు.

గుంటూరు జిల్లాలో మేడికొండూరు మండలం మందపాడులో విషాదం చోటుచేసుకుంది. పొలంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులను సువార్తమ్మ, ప్రభావతిలుగా గుర్తించారు. వివరాలు.. మందపాడులోని పొలాల్లో పిడుగు పడింది. ఈ ఘటనలో సువార్తమ్మ, ప్రభావతి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో.. మందపాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సువార్తమ్మ, ప్రభావతి మృతిచెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఇదిలాఉంటే, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలపై పిడుగు పడింది. తిరుమలాయపల్లి మండలం దమ్మాయిగూడెంలో మంగళవారం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఆ సమయంలో పొలాల్లో పని చేస్తున్న కూలీలు సమీపంలోని చెట్టు కిందకు చేరారు. అయితే వారి మీద పిడుగు పడింది. మొత్తంగా ఎనిమిది మంది కూలీలు పిడుగుపాటుకు గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగిలిన వారు కూడా గాయపడ్డారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.