జనసేన పార్టీకి ఒకే రోజు ఇద్దరు  కీలక నేతలు షాకిచ్చారు. రాజమండ్రికి సిటీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ నెల 8న వైసీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం సత్యనారాయణకి  రాజమండ్రి రూరల్ ఇన్‌ఛార్జి బాధ్యతలు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇక విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ వేత్త, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య జనసేనకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పంపారు.

కాగా.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోపెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. తన అనుచరులు, అభిమానులు ఇకపై రాజకీయ కార్యకలాపాలను గాజువాక నుంచి కొనసాగించాలని కోరుకుంటున్నారని అందువల్లే జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు చింతలపూడి లేఖలో తెలిపారు.

తనకు వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ అన్నా, మెగా కుటుంబమన్నా ప్రత్యేకమైన గౌరవం మరియు అభిమానం ఉందని... ఇప్పటి వరకు పార్టీలో తనపై చూపిన ఆదరాభిమానాలకు వెంకట్రామయ్య కృతజ్ఞతలు తెలిపారు.