విషాదం.. ఇద్దరిని పొట్టన బెట్టుకున్న రాకసి అల.. మరొకరు గల్లంతు, ఇద్దరి పరిస్థితి విషమం..
విహారయాత్ర ఆ అన్నదమ్ముల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. బీచ్ కు వచ్చి సరదాగా గడుపుదామనుకుంటే తీరని దు:ఖం మిగిలింది. ఓ రాకసి అల ఆ కుటుంబాల్లోని ఇద్దరి సభ్యులను మింగేసింది.

విహారయాత్ర విషాదం నింపింది. ఆదివారం కావడంతో అన్నదమ్ముల కుటుంబాల్లోని 13 మంది కలిసి బీచ్ కు వచ్చారు. వారంతా కలిసి సముద్రంలో సరదాగా స్నానం చేస్తుండగా.. ఓ రాకసి అల వారందరినీ తన వెంట తీసుకెళ్లింది. దీనిని గమనించిన స్థానికులు పలువురిని రక్షించారు. కానీ ఇద్దరు మరణించారు. మరొకరు గల్లంతయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. తణుకు కు చెందిన అన్నదమ్ముల కుటుంబ సభ్యులు ఆదివారం సరదాగా గడుపుదామని నిర్ణయిచుకొని నరసాపురం దగ్గరలోని పేరుపాలెం బీచ్ కు విహారయాత్రకు వచ్చారు. ఆ కుటుంబాల్లోని 13 మంది సభ్యులు రెండు ఆటోలు తీసుకొని బీచ్ కు చేరుకున్నారు. అనంతరం వీరంతా సముద్రపు అలల్లో స్నానం చేసేందుకు ఉపక్రమించారు.
ఈ క్రమంలో ఓ పెద్ద అల వచ్చింది. ఆ అల తిరిగి వెళ్తూ ఆ కుటుంబ సభ్యులందరినీ తిరిగి వెంట బెట్టుకెళ్లింది. వీరంతా కొట్టుకుపోతుండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే వారందరినీ రక్షించేందుకు ప్రయత్నించారు. కొందరినీ ఒడ్డుకు తీసుకొని వచ్చారు. కానీ ఇద్దరు నీటిలోనే గల్లంతు అయ్యారు. వారిలో 25 ఏళ్ల గొరస సావిత్రి డెడ్ బాడీ కొంత సమయం తరువాత ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. అయితే 17 ఏళ్ల వసంత కుమార్ ఆచూకీ లభించలేదు.
స్థానికులు ఒడ్డుకు తీసుకువచ్చిన వారిలో 25 ఏళ్ల అనపోజు రఘవర్మ, 19 ఏళ్ల అనపోజు శ్రావణి, 15 ఏళ్ల గొరస తన్మయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే నరసాపురం హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు. అయితే హాస్పిటల్ కు తీసుకు వెళ్లేలోపే రఘువర్మ పరిస్థితి విషమించడంతో చనిపోయారు. మిగిలిని ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన చికిత్స కోసం భీమవరం హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు.