చిత్తూరు రామాపురంలో ఏనుగు దాడి: దంపతుల మృతి
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురంలో ఏనుగు దాడిలో ఇద్దరు మృతి చెందారు.
చిత్తూరు: జిల్లాలోని గుడిపాల మండలం రామాపురంలో బుధవారం నాడు విషాదం చోటు చేసుకుంది. ఏనుగు దాడిలో దంపతులు మృతి చెందారు. పంట పొలం వద్ద ఉన్న రైతు దంపతులపై ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో సెల్వీ, ఆమె భర్త వెంకటేష్ మృతి చెందారు.ఈ విషయం తెలిసిన వెంటనే చిత్తూరు వెస్ట్ సీఐ రవిప్రకాష్ రెడ్డి, ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ఏనుగును అడవిలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో కూడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలో ఏనుగుల దాడిలో పలువురు మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి.2011 జనవరి 13న చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపును అడవిలోకి పంపుతున్న సమయంలో అటవీశాఖాధికారిపై ఏనుగులు దాడికి దిగాయి. ఈ దాడిలో అటవీశాఖాధికారి మృతి చెందారు. 2011 మే 6న విజయనగరం జిల్లా కొమరాడ మండలం పాతకలికోటలో ఏనుగు దాడిలో మహిళా రైతు మృతి చెందింది.
2020 నవంబర్ 13న విజయనగరం జిల్లా కొమరాడ మండలం పరశురాంపురంలో ఏనుగుల దాడిలో లక్ష్మీనాయుడు మృతి చెందారు.2022 మార్చి 31న చిత్తూరులోని సదుంజోగివారిపల్లెలో పంట పొలాలపై ఏనుగులు దాడి చేశాయి.పంటకు కాపలా ఉన్న రైతుపై దాడి ఏనుగు దాడి చేయడంతో ఆయన మృతి చెందాడు.
ఈ ఏడాది మే 12న కుప్పం మండలం చప్పానికుంటలో ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి చెందారు. శివలింగప్ప, ఉషలుగా మృతులను గుర్తించారు. పంట పొలాల్లో పనిచేస్తున్న మహిళలపై దాడి చేయడంతో మరో ముగ్గురు కూడ గాయపడ్డారు.