వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు రెండు రోజుల పాటే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజులు పెట్టాలనే అంశంపై టీటీడీ బోర్డు ఆదివారం అత్యవసరంగా సమావేశమైంది.

అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఉత్తర ద్వారాలు పదిరోజులు తెరవడంపై కమిటీ ని నియమించామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా వచ్చే ఏడాది దీనిని అమలు చేయ్యాలా..? లేదా..? అన్న దానిని నిర్ణయిస్తామని తెలిపారు.

కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కోర్టు ఆదేశాలతోనే పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించినట్లు ఛైర్మన్ వెల్లడించారు.

Also Read:వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు

అదనపు ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో పాలకమండలి సభ్యులతో కమిటీ దీనిపై అధ్యయనం చేస్తుందన్నారు. శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ అందజేస్తామని.. ఈ నెల 20 నుంచి భక్తులకు ఉచిత లడ్డూలు పంపిణీ చేస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు. 

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. జనవరి 6లోపు తుది నిర్ణయం తీసుకోవాలని టీటీడీని న్యాయస్థానం ఆదేశించింది

సాధారణ భక్తుల కోసం పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని కొనసాగించాలని కోరారు పిటిషనర్. దీనిపై స్పందించిన హైకోర్టు .. బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా నిర్ణయం తెలపాల్సిందిగా కోరింది. అయితే తుది నిర్ణయం విషయంలో తమ జోక్యం ఉండదని న్యాయస్థానం తెలిపింది.

ఎక్కువ మంది భక్తులు వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకు వస్తుండటంతో ఆ రెండు రోజులు తీవ్ర రద్దీ ఉంటోందని.. ఆ తర్వాత ద్వారాలు మూసివేయడం వల్ల సామాన్యులకు దర్శనం ఉండటం లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. అందువల్ల 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కొనసాగించాలని కోరాడు. వాదనల సందర్భంగా టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి కోర్టుకు హాజరయ్యారు.

Also Read:వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ఎందుకు దర్శించుకోవాలి?

మరోవైపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 6, 7 తేదీల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మెరుగైన దర్శనం, ఇతర సౌకర్యాలను కల్పించినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

తెల్లవారుజామున చలిలో ఇబ్బంది పడకుండా 85 వేల మంది భక్తులు సేదదీరేలా షెడ్లను నిర్మించామని, 3 లక్షల నీటి బాటిళ్లను సమకూర్చామన్నారు. అంతేకాకుండా క్యూలైన్లలో భక్తులకు నిరంతరం అన్నప్రసాదం, పాలు అందిస్తామని అనిల్ వెల్లడించారు.