చంద్రుడు భూమిని చుట్టి రావడానికి  ఇరవై తొమ్మిదిన్నర రోజులు అవుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క తిధి అనబడే చాంద్రమాసంలో 30 తిధులు ఉన్నాయి. అమావాస్య నుండి పౌర్ణమి వరకు గల 15 తిధులను శుక్ల పక్షమని పౌర్ణమి నుండి అమావాస్య వరకు గల తిధులను బహుళ పక్షమని ( కృష్ణ పక్షమి ) అని అంటారు.

అమావాస్య నాడు  సూర్య చంద్రులు  ఒకే సమయంలో  ఉదయించి ఒకే సమయంలో అస్తమిస్తారు. అక్కడ నుండి ఒక్కొక్క రోజు 
12 డిగ్రీల చొప్పున  చంద్రుడు, సూర్యుని నుండి  దూరమౌతాడు. నాల్గవ రోజు చవితి నాడు చంద్రుడు సూర్యుని నుండి 37  డిగ్రీలు మొదలు  48 డిగ్రీలు వెనుక బడతాడు. పదకొండవ రోజు ఏకాదశి నాడు సూర్యుని నుండి 134 డిగ్రీలు వెనుక ఉన్నట్టు. పౌర్ణమి నాడు సూర్యుని నుండి 180 డిగ్రీలు ఉంటుంది. పైన చెప్పిన రోజుల్లో సూర్యుని నుండి చంద్రుడు దూరముగా ఉన్నందున
భూమి ఆకర్షణ శక్తి అధికమవుతుంది. 

ఆలాంటి సమయంలో ఎప్పుడూ భోజనం చేసినట్లు చేస్తే జీర్ణక్రియ సరిగా ఉండదు. అందు వలన ఆ కాలంలో శాస్త్ర సూచనలు  ఉపవాసం చేయాలని చెబుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున చంద్రుడు సూర్యునికి 135 డిగ్రీలు వెనుకబడి ఉంటాడు. ఆనాడు  సూర్యుని మార్గానికి దక్షిణాన దూరంగా ఉంటాడు. ఆనాడు కూడా భూమి ఆకర్షణ శక్తి అధికమైనందున ఉపవాసం చేయాలి అని తెలియజేయబడినది. 

ఏకాదశిరోజు ఉపవాస వ్రతం చేయడం వలన పదిరోజుల నుండి తిన్న ఆహారంలో చేరిన మలినాలు ,అధిక కొవ్వు పదార్ధాలు కరిగి బయటికి పోతాయి. ఏకాదశిరోజు కడుపు శుభ్రపడుతుంది. ఆ రోజు జీర్ణక్రియకు విశ్రాంతి లభిస్తుంది. మనకు ముఖ్యంగా విటమిన్ 'ఏ' విటమిన్ 'సి' అవసరపడతాయి. అందు వలన  ద్వాదశి నాడు 'ఏ' విటమిన్ అధికంగా కలిగిన ఆకుకూరను, 'సి' విటమిన్ అధికంగా కలిగిన ఉసిరికాయలను ఆహారంలో చేర్చుకుంటున్నాము. 

ప్రతిరోజూ మనం సూర్య నమస్కారాలు చేసి ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వలన నేత్ర దృష్టికి, దేహానికి ఆరోగ్యం లభిస్తుంది.
ప్రతి నెలకు రెండు పక్షాలు 1. శుక్లపక్షము 2. కృష్ణ పక్షము ... పక్షానికొక ఏకాదశి చొప్పున్న .. ఏడాదిలో ఇరవైనాలుగు ఏకాదశులుంటాయి. ప్రతి నెల ఆమావాస్యకు, పౌర్ణమికి  ముందు ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఆషాడ శుక్ల ఏకాదశిని ప్రధమ ఏకాదశిగా పరిగణిస్తారు. ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధ ఏకాదశి అని అంటారు. సంవత్సరం మొత్తంలో ఇలాంటి  శుద్ధ ఏకాదశులు 12 వస్తాయి. ప్రతి నెల అమావాస్యకు  ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి సంవత్సరం మొత్తంలో ఇలాంటి బహుళ ఏకాదశులు 12 వస్తాయి. 

వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత ఉన్నను. ముఖ్యంగా నాలుగు ఏకాదశులను విశేషంగా పరిగణిస్తాము. అవే

1. ఆషాడ శుద్ధ ఏకాదశి ( తొలి ఏకాదశి / శయనేకాదశి )
2. కార్తీక శుద్ధ ఏకాదశి
3. పుష్య శుద్ధ ఏకాదశి ( వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి )
4. మాఘ శుద్ధ ఏకాదశి ( భీష్మ ఏకాదశి )

వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి. పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అని అంటారు. 

కాలంలో ఉత్తరం పగలు; దక్షిణం రాత్రి. మనం తూర్పు వైపు ముఖం పెట్టి నిలుచున్నప్పుడు కుడి చేయి దక్షిణం ఎడమ చేయి ఉత్తరం అవుతుంది. దేవతలకు ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి. రాత్రిని దక్షిణాయనం, పగటిని ఉత్తరాయణం అన్నారు. దక్షిణాయనం వెళుతుండగా చీకటి తొలగి సూర్యుడు - అంటే వైకుంఠుడు, ముక్తుడుకాగా దేవతలు కూడా చీకటి పోయి వెలుతురుకు వస్తారన్నమాట. అనగా వారికి పగలు ప్రారంభమైందన్నమాట. ఈ వైకుంఠ ద్వారమన్నది సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నముగా చెప్పుకుంటాము. ముక్కోటి దేవతలు ఈ రోజు ఉత్తరమందున్న శ్రీ మహా విష్ణువుని దర్శించుకుంటారు. అందుచే ప్రాతఃకాలంలో భక్తులు కూడా ముక్కోటి దేవతలతో కూడిఉన్న వైకుంఠుణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ముక్తి పొందాలని భావిస్తారు. 


ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. జపం, ధ్యానం.
విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహా విష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం ద్వారా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందు వలననే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. తిరువతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.

పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుండి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతోషపడి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. 

వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. 
ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మంద బుద్ధిని ఇచ్చి జాగురుకతను దెబ్బతీస్తాడని అంతరార్థం.
ఏకాదశినాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్న దానం చేస్తారు. 

ఓం నమో నారాయణాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 

ఉత్తర ద్వార దర్శనం'లో ప్రత్యేకత :- రాక్షసుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు. ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను దివి నుండి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరి వాసరమని, హరి దినమని, వైకుంఠ దినమని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి 'మూడు కోట్ల ఏకాదశుల'తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకాదశి వ్రతం" ఆచరించిన వారికి శుభ ఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకుంటారు. దీంతో స్వామి మురాసురుడి మీదికి దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంటాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు 'ఏకాదశి' అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని అంటారు.

సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు తిని ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతము చేసే వారికి మరో జన్మంటూ ఉండదని అంటారు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151