సామాన్యులు ప్రయాణించే ఆర్టిసి బస్సులో దాదాపు కోటీ తొంబై లక్షల రూపాయలు అక్రమంగా తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని ఎన్టీఆర్ జిల్లాలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.  

విజయవాడ: ఖరీదైన కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాలు అంత సేఫ్ కాదని భావిస్తున్నారో ఏమోగానీ కొందరు అక్రమార్కులు నగదు, బంగారం వంటివాటిని అక్రమ తరలించేందుకు ప్రజారవాణా వ్యవస్థను ఎంచుకుంటున్నారు. ఇటీవలకాలంలో బస్సులు, రైళ్లలో చేపట్టిన తనిఖీల్లో భారీగా పట్టుబడుతున్న సొత్తే ఇందుకు నిదర్శనం. మరీముఖ్యంగా ఆర్టిసితో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఇలా అక్రమంగా తరలిస్తున్న సొత్తు ఎక్కువగా పట్టుబడుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోనూ ఇలాగే పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి ఏపీలోని కాకినాడకు ఓ ఆర్టిసి బస్సులో భారీగా నగదు తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన ఆర్టిసి బస్సును ఆపిన పోలీసుల ప్రయాణికుల లగేజీని తనిఖీచేసారు. దీంతో ఓ ప్రయాణికుడి వద్దగల పెద్ద బ్యాగులో భారీగా నగదు పట్టుబడింది. 

VIDEO

పట్టుబడిన నగదు కోటీ తొంబై లక్షలుగా పోలీసులు తేల్చారు. ఈ నగదుకు సంబంధించి సరయిన పత్రాలు లేకపోవడంతో తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే నగదును కూడా స్వాధీనం చేసుకుని చిల్లకల్లు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సరయిన పత్రాలు చూపిస్తే ఈ నగదును తిరిగి అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. 

ఇలా సామాన్యులు ప్రయాణించే ఆర్టిసి బస్సులో కోట్లకొద్ది నోట్లకట్టలు దొరకడం కలకలం ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపింది. ప్రైవేట్ వాహనాల్లో నగదు అక్రమ రవాణాపై పోలీసులు నిఘా ఎక్కువగా వుండటంతో అక్రమార్కులు ప్రజారవాణా వ్యవస్థను ఇందుకోసం వాడుకుంటున్నారు. అయినప్పటికి కొందరు పోలీసుల తనిఖీల్లో అడ్డంగా బుక్కవుతున్నారు. 

ఇటీవల తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం టోల్ ప్లాజా వద్దకూడా ఇలాగే భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించగా 2 కోట్ల నగదు పట్టుబడింది. 

విజయనగరం జిల్లా నుంచి గుంటూరు వెళ్తున్న పద్మావతి ట్రావెల్స్ కు చెందిన ఏపీ 39టీబీ 7555 నెంబర్ గల బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బస్సు సీట్ల కింద లగేజ్ క్యారియర్ లో భారీగా నగదు తరలిస్తుండడాన్ని గమనించారు. దీనికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో బస్సు డ్రైవర్, క్లీనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ఇక గత నెల మార్చిలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి తమిళనాడులోని కోయంబత్తూరుకు గుట్టుగా తరలిస్తున్న కిలోలకొద్దీ బంగారం, వెండితో పాటు భారీ నగదు ఏపీ పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. దాదాపు ఐదు కోట్ల రూపాయల విలువైన సొత్తును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా ఏపీకి చెందిన స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. కర్నూలు పట్టణ శివారులోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద ఈ సొత్తు పట్టుబడింది. తమిళనాడుకు చెందిన ఐదుగురు ప్రయాణికులు ఈ సొత్తును తరలిస్తూ పట్టుబడ్డారు. 

పట్టుబడిన సొత్తుకు సంబంధించిన వివరాలను ఎస్ఈబీ అధికారులు వెల్లడించారు. 8.250కిలోల బంగారు బిస్కెట్లు, 28.5కిలోల వెండితో పాటు రూ.90లక్షల నగదు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సొత్తుకు సంబంధించిన పత్రాలేవీ లేకపోవడంతో వీటిని తరలిస్తున్న దేవరాజు, మురుగేషన్, వెంకటేశ్, కుమారవేలు, సెల్వరాజులను అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించినట్లు ఎస్ఈబి అధికారులు వెల్లడించారు.