ఇద్దరు ఐఏఎస్ లకు అల్జిమర్స్

ఇద్దరు ఐఏఎస్ లకు అల్జిమర్స్

ఇద్దరు విశ్రాంత ఐఏఎస్ అధికారులకు అల్జిమర్స్ సోకింది. విధి నిర్వహణలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఇద్దరూ ప్రస్తుతం తమ గతాన్ని మరచిపోయారు. తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని ఏరూపంలో కూడా ఎవరికీ ఉపయోగించలేని స్ధితిలో ఉన్నారు. గతం గుర్తురాక, వర్తమానమేంటో తెలీక నానా అవస్ధలు పడుతున్నారు. వారి గతం గురించి పూర్తిగా తెలిసిన వారు వారి ప్రస్తుత పరిస్ధితిని దగ్గర నుండి గమనించటం మినహా  ఏమీ చేయలేక చలించిపోతున్నారు.

ఇంతకీ ఏవరా ఇద్దరూ అనుకుంటున్నారా? వారే, జన్నత్ హుస్సేన్, టిఆర్ ప్రసాద్. వీరిలో  టిఆర్ ప్రసాద్ దేశంలోని ఐఏఎస్ అధికారులకు అత్యున్నత స్ధానమైన క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తర్వాత సొంతూరైన విశాఖపట్నం వచ్చేసి పిల్లల వద్ద ఉంటున్నారు. తన వద్దకు వచ్చే వారిని గుర్తుపట్టలేకపోతుంటే అనుమానం వచ్చి కుటుంబసభ్యులు వైద్య పరీక్షలు చేయించారు. దాంతో ప్రసాద్ అల్జిమర్స్ తో బాధపడుతున్నట్లు తేలింది. అప్పటి నుండి కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేకపోతున్నారు.

ఇక, జన్నత్ హుస్సేన్ ది అదే పరిస్ధితి. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన జన్నత్ ఐఏఎస్ కు ఎంపికైన తర్వాత ఏపిలో నియమితులయ్యారు.  కాకినాడ సబ్ కలెక్టర్ గా 1977లో ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టిన జన్నత్ వివిధ హోదాల్లో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సిఎంవోలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసారు. తర్వాత సమాచార హక్కుచట్టం ప్రధాన కమీషనర్ గా కూడా పనిచేసారు. చివరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రిటైర్ అయ్యారు.

విరమణ తర్వాత నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరు పేటలో రెండో కొడుకు వద్దకు వెళిపోయిన జన్నత్ కు అక్కడే అల్జిమర్స్ సోకింది. వైద్యం కోసం అమెరికా తీసుకెళ్ళినా ఉపయోగం కనిపించలేదు. దాంతో అప్పటి నుండి కుటుంబసభ్యులే జన్నత్ ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. రాష్ట్రానికే చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులకు విధి నిర్వహణలో ఘనమైన చరిత్రే ఉంది. అయితే, అల్జిమర్స్ సమస్య వల్ల వారి సేవలను ఏ రూపంలో కూడా ప్రభుత్వాలు ఉపయోగించుకోలేకపోవటం నిజంగా దురదృష్టమే.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos