కుటంబ కలహాలే కారణమా..?

టీవీ యాంకర్ ఆత్మహత్య విజయవాడ నగరంలో కలకలం రేపింది. కుటుంబ కలహాల కారణంగానే యాంకర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈడుపుగల్లు ఎంబీఎంఆర్‌ కాలనీలోని ఫ్లాట్‌ నంబర్‌ 105లో గత కొంత కాలంగా దంపతులు మట్టపల్లి తేజశ్విని, పవన్‌కుమార్‌ ఉంటున్నారు. రెండేళ్ల క్రితమే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. తేజశ్విని ఓ చానల్‌లో న్యూస్‌ రీడర్‌గా పనిచేసేది. భర్త పవన్‌కుమార్‌ ఉయ్యూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.

శనివారం రాత్రి తేజశ్విని అత్త అన్నపూర్ణాదేవితో గొడవ పడింది. అనంతరం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతకీ తేజశ్విని గదిలోనుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అత్త గది వద్దకు వెళ్లి చూసింది. ఉరేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించింది. 

 కాగా.. వీరి ప్రేమ వివాహం మొదటి నుంచి కుటుంబసభ్యులకు ఇష్టం లేదనేవిషయం విచారణలో తేలింది. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలోనే శనివారం కూడా ఇంట్లో గొడవ జరిగింది. తరచూ గొడవల నేపథ్యంలో మనస్థాపం చెందిన తేజశ్విని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.