అమరావతి: మంగళవారం జరగబోయే కేబినేట్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో పలు నిర్ణయాలపై కేబినేట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అతిపెద్ద ఇండస్ట్రీయల్ హబ్ కు మంగళవారం కేబినేట్ ఆమోదం తెలపనుంది. దొనకొండలో ఏర్పాటు చెయ్యబోయే మెగా ఇండస్ట్రీయల్ హబ్ కు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 

అలాగే అసైన్డ్, ఇనాం భూములు, చుక్కల భూములపై కేబినేట్ దిశా నిర్దేశం చేయనుంది. భూములపై ఓ కీలక నిర్ణయం ప్రకటించనుంది. ఈ భూములపై నిర్ణయం తీసుకోవడం వల్ల 40 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. 

అలాగే ఇటీవలే కడప జిల్లాలో ఏడవ ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు కేబినేట్ సమావేశంలో కడప ఉక్కు కర్మాగారంపై కీలక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దీంతో యావత్ కడప జిల్లా అంతా ఆసక్తిగా చూస్తోంది. ఉక్కుకర్మాగారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని యువత కోటి ఆశలతో ఎదురుచూస్తోంది. 

కేబినేట్ భేటీ అనంతరం మధ్యాహ్నాం 2 గంటలకు టీడీపీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం భేటీ కానుంది. ఈ భేటీలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు,  ఇంచార్జ్ లు, రాష్ట్ర కార్యకవర్గ సభ్యులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.  టీడీపీ సభ్యత్వం నమోదు, గ్రామదర్శినిపై చంద్రబాబు చర్చించనున్నారు.