ఎమ్మెల్సీ సిఫారసు లేఖలపై జారీ చేసే బ్రేక్ దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గుర్తించారు. దీని వెనుక మరేవరైనా వున్నారా అన్న కోణంలో టీటీడీ విచారణ జరుపుతోంది.
టీటీడీ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అధికారులు ఎంతగా నిఘా పెడుతున్నా తిరుమలలో కేటుగాళ్లు రెచ్చిపోతూనే వున్నారు. తాజా ఎమ్మెల్సీ సిఫారసు లేఖలపై జారీ చేసే బ్రేక్ దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతర్గత విచారణలో ఓ టీటీడీ ఉద్యోగి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. సదరు ఉద్యోగి హైదరాబాద్‌కు చెందిన భక్తులకు శ్రీవారి బ్రేక్ దర్శన టికెట్లను రూ.36 వేలకు విక్రయించినట్లు తేలింది. అయితే బ్రేక్ దర్శన టికెట్ల విక్రయాలపై టీటీడీ విజిలెన్స్ అధికారులకు అనుమానం రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని భక్తులను ప్రశ్నించగా.. టీటీడీ ఉద్యోగి దందా బయటపడింది. దీని వెనుక మరేవరైనా వున్నారా అన్న కోణంలో టీటీడీ విచారణ జరుపుతోంది.
ఇకపోతే.. తిరుమలలో శ్రీవారి ఆలయ భద్రతకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయానికి ఆక్టోపస్ క్యూఆర్టీ (క్విక్ రియాక్షన్ టీమ్)తో భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి ప్రకటన చేశారు. తిరుమల ఆలయం వద్ద భద్రత ఏర్పాట్లను తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆక్టోపస్ అధికారులతో కలిసి డీఐజీ అమ్మిరెడ్డి పరిశీలించారు. తిరుమల ఆలయం వద్ద పటిష్ట భద్రత కోసం ఆక్టోపస్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు.
Also Read: తిరుమల శ్రీవారి ఆలయ భద్రత విషయంలో కీలక నిర్ణయం.. ఇకపై ఆక్టోపస్ క్యూఆర్టీ పర్యవేక్షణలో..
శ్రీవారి ఆలయం ప్రవేశమార్గంలో వద్ద ఆక్టోపస్ టీమ్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ చాంబర్ ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. ఇందులో 5 నుంచి ఆరుగురు సభ్యులతో ఆక్టోపస్ బృంద.., సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్స్, డే-విజన్ గ్లాసెస్, అత్యాధునిక ఆయుధాలతో శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటారని డీఐజీ తెలిపారు. వీరు శ్రీవారి ఆలయ ముఖద్వారాన్ని ప్రధానంగా రక్షిస్తారని చెప్పారు. ఈ బృందం 24 గంటలు నిరంతరాయంగా షిప్టుల వారీగా పనిచేస్తుందన్నారు. ఇక, ఆక్టోపస్ టీమ్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ చాంబర్ ఏర్పాటు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.
టీటీడీ, ఇతర అనుబంధ భద్రతా విభాగాల సమన్వయంతో పోలీసు శాఖ నిరంతరంగా శ్రీవారి ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లను అప్‌గ్రేడ్ చేస్తోందని అమ్మిరెడ్డి చెప్పారు. తిరుమలలో భద్రతను మరింత పెంచేందుకు జూన్‌లో జరిగిన ఆలయ భద్రతా కమిటీ సమావేశంలో అనేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేసి, వారికి నిర్దిష్ట పనులను కేటాయించిందని తెలిపారు. ఈ కమిటీల నుంచి పూర్తిస్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా టీటీడీ దృష్టికి తీసుకువచ్చి తగిన చర్యలు తీసుకుంటామన్నారు
