తిరుపతి: టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమానికి టీటీడీ ముహుర్తాన్ని ఖరారు చేసింది. మూడు విడతల్లో కళ్యాణ మస్తు కార్యక్రమాన్ని నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.

ఈ ఏడాది  మే 28, అక్టోబర్‌ 30, నవంబర్‌ 17వ తేదీల్లో కళ్యాణమస్తు నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.ఈ విషయాన్ని టీటీడీ  ఈఓ జవహర్‌ రెడ్డి ప్రకటించారు. పవిత్ర లగ్నపత్రికను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలను ఇప్పటికే పూర్తి చేసింది. 

అలాగే కల్యాణమస్తులో ఒకటయ్యే జంటలకు అందించే తాళిబొట్టును ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం  టీటీడీ ట్రెజరీలో సిద్ధంగా ఉన్న 20వేల తాళిబొట్లను వినియోగించుకోనుంది. 

శ్రీవారి సమక్షంలో పేద హిందువులు వివాహం చేసుకునేలా 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వధూవరులకు టీటీడీ తరఫున నూతన వస్త్రాలు, బంగారు తాళిబొట్టును అందించడమే కాకుండా 50మంది బంధువులకు భోజనాలను వితరణ చేసేవారు.

 2007 నుంచి 2011 వరకు ఏటా రెండు విడతలుగా కల్యాణమస్తును నిర్వహించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం నిలిచిపోయింది. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కల్యాణమస్తును పునఃప్రారంభించాలని నిర్ణయించారు. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించాలనే విషయాన్ని టీటీడీ పాలకమండలిలో నిర్ణయిస్తామని ఈఓ తెలిపారు.