అమరావతి: అయోధ్యలో తిరుమల వెంకన్న ఆలయం నిర్మాణానికి టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. అయోధ్యలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని టీటీడీ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.ఈ విషయమై యూపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే అయోధ్యలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించనుంది టీటీడీ.

దేశంలో పలు చోట్ల 49 టీటీడీకి అనుబంధ ఆలయాలున్నాయి. ప్రస్తుతం కాశీ, జమ్మూలో కూడ బాలాజీ ఆలయాలను నిర్మించాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు స్థలాన్ని కేటాయించాాలని ఆయా ప్రభుత్వాలను టీటీడీ కోరింది.

హైందవ సనాతన ధర్మాన్ని, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు టీటీడీ ఈ ఆలయాలను నిర్మించేందుకు పూనుకొంది. దేశ విదేశాల నుండి తిరుపతికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఉత్తరాది నుండి ఎక్కువగా శ్రీవారిని దర్శించుకొనేందుకు వస్తుంటారు. దీంతో భక్తుల కోరిక మేరకు ఆయా రాష్ట్రాల్లో ఆలయాలను  నిర్మించేందుకు టీటీడీ పూనుకొంది.

జమ్మూలో ఆలయ నిర్మాణం కోసం ఆ ప్రభుత్వంతో టీటీడీ సంప్రదింపులు జరిపింది. డుమ్మీ, మజిన్ పరిసరాల్లో జమ్మూ ప్రభుత్వం స్థలాన్ని కూడ నిర్ధారించింది.