Asianet News TeluguAsianet News Telugu

తిరుమల మాడవీధుల్లో చెప్పులతో నడక, ఫోటో షూట్.. నయనతార దంపతులపై టీటీడీ సీరియస్

తిరుమల ఆలయ పరిసరాల్లో ఫోటో షూట్‌తో పాటు మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచిన వ్యవహారంపై సినీనటి నయనతార దంపతులపై టీటీడీ సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. 

ttd series on actress Nayanthara walking around with sandals at tirumala temple premises
Author
Tirumala, First Published Jun 10, 2022, 8:02 PM IST

తిరుమల ఆలయ (tirumala temple ) పరిసరాల్లో సినీనటి నయనతార (Nayanthara) , ఆమె భర్త విఘ్నేష్ శివన్‌ల (vignesh shivan) తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) (ttd) స్పందించింది. నయనతార దంపతుల ఫోటో షూట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల మాడవీధుల్లో నయనతార చెప్పులు ధరించి రావడం దురదృష్టకరమని.. హీరోయిన్ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని టీటీడీ తెలిపింది. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చన్న అంశంపై చర్చిస్తున్నామని టీటీడీ పేర్కొంది. 

నిన్న ప్రియుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లాడిన నయనతార.. శుక్రవారం భర్తతో కలిసి తిరుమల  శ్రీవారి దర్శనానికి వచ్చారు. వెంకటేశ్వరుని దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన వీరిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. దర్శనానంతరం బయటకు వచ్చిన ఆమె మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచారు. ఆమె భర్త విఘ్నేష్ శివన్‌తో పాటు ఇతరులందరూ చెప్పుల్లేకుండానే నడిచారు. కానీ నయనతార మాత్రం చెప్పులు ధరించడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read:తిరుమల మాడవీధుల్లో చెప్పులతో నడిచిన నయనతార, ఆపై మహాద్వారం వద్ద ఫోటోషూట్.. వివాదం

ఇదే పెద్ద వివాదం అయ్యేలా కనిపిస్తుంటే.. శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారానికి సమీపంలో నయనతార, విఘ్నేష్ శివన్‌లు ఫోటో షూట్ చేసుకోవడం మరో కాంట్రవర్సీకి కారణమైంది. భక్తులు పరమ పవిత్రంగా భావించే ఈ ప్రాంతంలో కెమెరాలు వాడటంపై నిషేధం వుంది. మరి వీరి ఫోటో‌షూట్‌కి అనుమతి ఇచ్చింది ఎవరనే విమర్శలు వస్తున్నాయి. మరి నయనతార చేసిన పనికి టీటీడీ జరిమానా విధిస్తుందా లేక సెలబ్రెటీ కాబట్టి మందలించి వదిలేస్తుందా అంటూ భక్తులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. తిరుమల పవిత్రతను కాపాడటం అంటే ఇదేనా..? గుడి ప్రాంగణంలో చెప్పులు వేసుకుని తిరుగుతుంటే టీటీడీ నిద్రపోతుందా..? అంటూ ఫైర్ అవుతున్నారు. 

కాగా.. గురువారం ఉదయం 8:30 నుంచి నయనతార, విగ్నేష్ శివన్ ల వివాహం ప్రారంభం అయింది. దాదాపు ఏడేళ్ల సహజీవనానికి తెరదించుతూ వీరిద్దరూ అధికారికంగా భార్య భర్తలు అయ్యారు. మహాబలిపురంలో విగ్నేష్, నయనతార వివాహం వైభవంగా జరిగింది. మొదట తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వలన వేదిక మార్చారు. 2015లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నానున్ రౌడీదాన్ మూవీ విడుదలైంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి-నయనతార హీరో హీరోయిన్స్ గా నటించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుండి వీళ్ళ ప్రేమ ప్రయాణం మొదలైంది. పేరుకు ప్రేమికులే అయినా భార్యాభర్తలుగా మెలిగారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios