Asianet News TeluguAsianet News Telugu

శ్రీవాణి ట్రస్టుకు రూ. 861 కోట్లు నిధులు వచ్చాయి.. శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ..

తిరుమల శ్రీవాణి ట్రస్టు విరాళాలపై వస్తున్న ఆరోపణలను టీటీడీ ఇదివరకే ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుమల శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన విరాళాలపై టీటీడీ శ్వేత పత్రాన్ని విడుదల చేసింది.

TTD release white paper on Srivani trust funds ksm
Author
First Published Jun 23, 2023, 10:36 AM IST

తిరుమల శ్రీవాణి ట్రస్టు విరాళాలపై వస్తున్న ఆరోపణలను టీటీడీ ఇదివరకే ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుమల శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన విరాళాలపై టీటీడీ శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. టీటీడీలో అవినీతి చేయాలంటే ఎలాంటి వారైనా భయపడాల్సిందేనని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే ట్రస్టుపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. గతంలో బంగారం డిపాజిట్ల మీద, ఫిక్సిడ్ డిపాజిట్ల మీద, టీటీడీ ఆస్తుల మీద కూడా శ్వేతపత్రాలు విడుదల చేశామని  గుర్తుచేశారు. 

శ్రీవాణి ట్రస్టుకు పదివేల విరాళం ఇచ్చిన వారికి వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నామని తెలిపారు. 2023 మే 31 వరకు శ్రీవాణి ట్రస్టుకు 861 కోట్లు నిధులు వచ్చాయని చెప్పారు. 2018లోనే శ్రీవాణి ట్రస్టు ప్రారంభమైందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో ట్రస్టును పునరుద్ధరించినట్టు పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులు ఎక్కడా దుర్వినియోగం కావడం లేదని స్పష్టం చేశారు. రూ.500, రూ.300లకు భక్తులకు రసీదు ఇవ్వడమనేది అవాస్తవమని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిధులు వివిధ బ్యాంకుల్లో రూ.602.60 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. సేవింగ్స్ ఖాతాలో రూ.139 కోట్ల నిధులు ఉన్నాయని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధుల డిపాజిట్ల ద్వారా రూ.36.50 కోట్ల వడ్డీ వచ్చిందని వెల్లడించారు.

దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం రూ. 120.24 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఇతర రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాలను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. ఈ పనుల కోసం రూ. 139 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 2,273 ఆలయాల నిర్మాణానికి రూ. 227.30 కోట్లు కేటాయించినట్టు వివరించారు. ట్రస్ట్‌పై అనవసర ఆరోపణలు మానుకోవాలని రాజకీయ నాయకులకు హితవు పలికారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ఎటువంటి అనుమానాలు ఉన్నా నేరుగా టీటీడీని సంప్రదించవచ్చని అన్నారు. ఎవరితో తనికీ చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదని  చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios