కరోనా ప్రభావం భారతదేశ ఆధ్యాత్మిక కేంద్రాలపైనా పడుతోంది. ఇప్పటికే దేశంలోని ప్రసిద్ధ ఆలయాలు, ఇతర ఆధ్యాత్మిక సంస్థలను అధికారులు మూసివేశారు. ప్రతి నిత్యం భక్తులతో కిటకిటలాడే షిర్డీలోని సాయి దేవాలయం, వైష్ణో దేవి ఆలయంతో పాటు మరెన్నో కోవెలలు మూతపడ్డాయి. తాజాగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని కరోనా తాకింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో శ్రీవారి ఆలయం మూసివేసేందుకు టీటీడీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో గురువారం టీటీడీ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు.

Also Read:వారందరికి గృహనిర్బంధ నోటీసులు... కరోనాపై ఏపి వైద్యశాఖ బులెటిన్

ఈ భేటీలో శ్రీవారి ఆలయాన్ని మూసివేసే అంశంపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏకాంతంగా శ్రీవారి సేవలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే శ్రీవారి పుష్కరిణీని టీటీడీ మూసివేసింది భక్తుల సౌకర్యార్ధం వాటర్ షవర్లను ఏర్పాటు చేసింది. తిరుమలకు భక్తులు వచ్చే రెండవ ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు.

Also Read:ఏపీలో రెండు కరోనా కేసులు.. ప్రభుత్వం అలర్ట్

అంతేకాదు నేటి సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను కూడా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. రేపు ఉదయం నుంచి రెండు ఘాట్ రోడ్లను, అలిపిరి మెట్ల మార్గాన్ని పూర్తి స్థాయిలో మూసివేస్తామని దేవస్థానం అధికారులు ప్రకటించారు. 

మరోవైపు తిరుమలలో ఓ భక్తుడు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. మహారాష్ట్ర నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు తీవ్ర జలుబు, జ్వరంతో అతను కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో టీటీడీ అధికారులు ఆ భక్తుడిని రుయా ఆసుపత్రికి తరలించారు.