వారందరికి గృహనిర్బంధ నోటీసులు... కరోనాపై ఏపి వైద్యశాఖ బులెటిన్

అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ నిరోధక చర్యలపై ఏపి వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 

AP Medical Department Release Bulletin On Corona

అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ -19(కరోనా) వైరస్ భారతీయుల్ని బెంబేలెత్తిస్తోంది. ఈ వైరస్ బారినపడినవారి సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య రెండుకు చేరుకుంది. దీంతో ఏపి ప్రభుత్వం మరింత  అప్రమత్తమయ్యింది. 

కరోనా నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ప్రకాశం జిల్లాలో కొవిడ్-19 పాజిటివ్ కేసు నమోదయ్యిందయినట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు చెందిన కొవిడ్ -19 బాధితుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యారోగ్యశాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. 14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్ ను పరీక్షించి వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గినట్లు తేలితే డిశ్చార్జి చేస్తామన్నారు.  

కరోనా వైరస్ పై సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో వచ్చే  వదంతుల్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అవాస్తవాల్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని 
జవహర్ రెడ్డి హెచ్చరించారు. విదేశాల నుండి ఏపీకి తిరిగి వచ్చిన వారందరికీ స్వీయ గృహ నిర్బంధ నోటీసులు ఇచ్చామని...అతిక్రమిస్తే ''ఏపీ ఎపిడమిక్ డిసీజ్ కొవిడ్-19,2020 ఐపిసి సెక్షన్ 188'' ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. 

read more  శ్రీ వెంకటేశ్వరుని తాకిన కరోనా: తిరుమల ఆలయం మూసివేత..?

ప్రస్తుతం రాష్ట్రంలో మాస్కులు, శానిటైజర్ల  కొరత లేదని తెలిపారు. కొవిడ్-19 వైరస్ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరంతరం సమీక్షిస్తున్నామని... ఎవ్వరూ ఆందోళన పడొద్దని అన్నారు.  కొవిడ్ -19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని... లక్షణాలుంటే వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలన్నారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని సూచించారు. 

కొవిడ్ -19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చిన 883 మంది ప్రయాణికుల్ని గుర్తించినట్లు... వారిలో 607 మంది ఇళ్లలోనే  వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 254 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందన్నారు. 22 మంది ఆసుపత్రిలో  వైద్యుల పరిశీలనలో ఉన్నారని... 109 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 94 మందికి నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. మరో 13 మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని జవహర్ రెడ్డి వెల్లడించారు. 

కొవిడ్-19 ప్రభావిత దేశాల  నుండి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా లేకపోయినా 14రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశించారు. బయటికి వెళ్లకూడదని... అలాగని 
కుటుంబ సభ్యులు, ఇతరులతో కలవకూడదన్నారు. వ్యాధి లక్షనాలుంటే కేవలం 108 వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ప్రతి జిల్లాలోని బోధన, జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేశామని జవహర్ రెడ్డి వెల్లడించారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios