తిరుమల: అలిపిరి టోల్ గేట్ వద్ద భక్తులపై టీటీడీ పోలీసులతో లాఠీ చార్జి చేయించిందని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సామాజిక మీడియా ద్వారా చేసిన ఆరోపణలు అవాస్తవమని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. దర్శనం టోకెన్లు లేని భక్తులు టోల్ గేట్ వద్దకు రాగా పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు వారికి సర్ది చెప్పి వెనక్కి పంపారని... అంతేగానీ భక్తులపై లాఠీచార్జి చేయలేదని తెలిపింది.  

''కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో టోకెన్లు, టికెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించబోమని చాలా రోజుల నుంచి ప్రచార, ప్రసార సాధనాల్లో భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తూనే ఉంది.
 కానీ కొందరు భక్తులకు ఈ విషయం తెలియిన తిరుమలకు చేరుకుంటున్నారు. ఇలా టోకెన్లు, టికెట్లు లేకుండా వచ్చినవారిని మాత్రమే వెనక్కి పంపిస్తున్నాం'' అని టిటిడి అధికారులు వెల్లడించారు.

''ఇక అన్నమయ్య మార్గంలో మంగళవారం  మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి తో పాటు వస్తున్న వారు పాప వినాశనం అటవీ ప్రాంతంలో  డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఫోటోలు, వీడియో తీస్తున్నారని సమాచారం అందిందని...దీంతో విజిలెన్స్ అధికారులు వెళ్లి వాటిని సీజ్ చేసినట్లు టీటీడీ ప్రజాసంబంధాల విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.

read more  వెంకన్నతో పెట్టుకుంటే.. ఏమవుతుందో జగన్ కి బాగా తెలుసు : నారా లోకేష్..

''అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంటగలిపేలా వ్యవహరిస్తోంది. స్వామి వారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుండి వచ్చిన సామాన్య భక్తులను కొండపైకి అనుమతించకపోగా లాఠీఛార్జి చేయడం హేయం'' అంటూ భక్తులు నిరసన తెలుపుతున్న వీడియోను జతచేసి చంద్రబాబు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

''ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. నిబంధనలకు విరుద్ధంగా 2 వేల మంది వైసీపీ శ్రేణులు తిరుమల కొండ మీద రాజకీయ ఊరేగింపులు చేస్తూ, డ్రోన్లు ఎగురవేస్తుంటే భద్రతాధికారులు ఏం చేస్తున్నట్లు.? స్వామి వారిని దర్శించుకునే హక్కు ప్రతి భక్తుడికి ఉందని గుర్తించాలి. ప్రభుత్వం ప్రచార ఆర్భాటం పక్కన పెట్టి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాలి'' అని టిటిడిని చంద్రబాబు సూచించారు. ఈ ట్వీట్లపైనే టిటిడి తాజాగా స్పందించింది.