ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజధాని అమరావతి పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. దాదాపు రూ.27.21 కోట్లతో నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణంపై చర్చ జరిపిన పాలకమండలి సభ్యులు ఆమోదం తెలిపారు.

ఇవాళ సమావేశమైన టిటిడి పాలకమండలి సభ్యులు మరికొన్ని కీలక అంశాలపై కూడా చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎంతో నియమ నిష్టలతో జరగాల్సిన శ్రీవారి పూజాధికాలు, ప్రత్యేకమైన రోజుల్లో జరగాల్సిన క్రతులు సరిగ్గా ఆగమ  శాస్త్రాల ప్రకారం జరగడం లేదని కొందరు పండితులు విమర్శిస్తున్నారు. అందుకోసం శ్రీవారి ఆలయ ఆగమ సలహామండలి సభ్యులుగా అనంతశయ్య దీక్షితులను నియమిస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది.

ఇక అలిపిరి వద్ద భక్తులు బస చేసేందుకు రూ.67 కోట్లతో ఓ భవనాన్ని నిర్మించడానికి ఆమోదం తెలిపింది. అంతే కాకుండా పలు ఏజన్సీ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం చేపట్టనున్నట్లు టిడిపి ప్రకటించింది. ముఖ్యంగా పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరంలో ఆలయాలు నిర్మిచాలని టిటిడి నిర్ణయించింది. 

ఇక తిరుమలలో భద్రత పర్యవేక్షణకు రూ.15 కోట్లతో 1,050 సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే మరో క్యూ లైన్ నిర్మాణానికి 17.21 కోట్లు, స్మార్ట్ డేటా ఏర్పాటుకు  రూ.2.63 కోట్లు కేటాయించింది. అలాగు పలమనేరులో గోశాల అభివృద్ధికి రూ.40 కోట్లు కేటాయిస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది.