సాయంత్రానికి టీటీడీ కొత్త పాలకమండలి నియామకం.. రేసులో పేర్ని నాని, ద్వారంపూడి..?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకమండలి కొలువుదీరే సమయం ఆసన్నమైంది. సారి ఎమ్మెల్యే కోటాలో పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు వున్నారని సమాచారం.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకమండలి కొలువుదీరే సమయం ఆసన్నమైంది. ఈ సాయంత్రం సభ్యుల నియామకం జరిగే అవకాశం వుంది. మొత్తం 24 మందిని ప్రభుత్వం నియమిస్తుంది. వీరితో పాటు ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులు వుంటారు. ఈ దఫా ఆశావహులు పెద్ద ఎత్తున వున్నారన్న ప్రచారం జోరు అందుకుంది. ఈసారి ఎమ్మెల్యే కోటాలో పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు వున్నారని సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుబ్బరాజు, దాట్ల రంగావత్ కూడా పాలకమండలిలోకి వస్తారని సమాచారం. ఇటు రాయలసీమ నుంచి ఆనందరెడ్డికి ఛాన్స్ వుందని ఊహాగానాలు జోరు అందుకున్నాయి.
ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక నుంచి సిద్ధరామయ్య కోటా దేశ్‌పాండేకే చోటు అవకాశం వుందని తెలుస్తోంది. ఏపీ గవర్నర్ కోటాలో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ వస్తారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు నుంచి సీఎం ఎంకే స్టాలిన్ సిఫారసు మేరకు తిరుపూర్ బాలాని పాలకవర్గంలోకి తీసుకునే అవకాశం వుంది. మహారాష్ట్ర నుంచి ముగ్గురికి అవకాశం లభించే ఛాన్స్ వుంది. తెలంగాణ నుంచి ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత సత్యనారాయణ రెడ్డి ఆశావహుల లిస్ట్‌లో వున్నారు.
Also Read: టీటీడీ ఛైర్మన్‌గా క్రిస్టియనా.. దారుణం, హిందువులంటే ఎందుకంత ద్వేషం : జగన్‌పై రాజాసింగ్ ఆగ్రహం
కాగా.. టీటీడీ ఛైర్మన్ తర్వాత పాలకమండలి సభ్యుల పాత్ర కీలకం. దేవస్థానంలో అమలు చేయాల్సిన నియమాలన్నీ పాలకమండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ప్రకటించిన ప్రభుత్వం .. సభ్యుల ఎంపికలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ సాయంత్రానికల్లా పాలకమండలిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయం కావడంతో రాష్ట్రం నుంచే అధిక భాగం సభ్యుల్ని నియమించే అవకాశం వుందని తెలుస్తోంది. గతంలో టీటీడీలో అనుభవం వున్న వారితో పాటు కొత్త సభ్యులు వచ్చినా పాలకమండలి సజావుగా సాగేలా ఛైర్మన్ నిర్ణయాలు వుండాలని సామాన్యులు కోరుకుంటున్నారు.