తిరుమలలో భక్తుల వసతి గదుల అద్దె పెంపు.. అందుకే పెంచాం, టీటీడీ వివరణ
తిరుమలలో భక్తుల వసతి గదుల అద్దె పెంపుపై విమర్శల నేపథ్యంలో టీటీడీ స్పందించింది. అదనపు సౌకర్యాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తిరుమలలో భక్తుల వసతి గదుల అద్దె పెంపుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. సామాన్యుడికి శ్రీవారిని దూరం చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ స్పందించింది. వసతి గృహాల్లో మార్పులు, చేర్పులు చేశామని.. మెరుగైన వసతులు కల్పించామని అందుకు అనుగుణంగానే వసతి గృహాల అద్దెను పెంచామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. దీనిపై అనవసరంగా రాద్దాంతం చేయొద్దని వారు కోరారు. 30 ఏళ్ల నాటి అద్దెనే ఇప్పటికీ వసూలు చేస్తున్నామని.. గదులను ఆధునికీకరించి ఏసీ, కొత్త ఫర్నిచర్, గీజర్లు వంటి సదుపాయాలు కల్పించామని టీడీపీ పేర్కొంది. అయితే సాధారణ భక్తులు బుక్ చేసుకునే రూ.50, రూ.100 గదల అద్దెలను పెంచలేదని టీటీడీ వెల్లడించింది.
మరోవైపు.. తిరుమలలో వసతి గదుల అద్దె పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ బీజేపీ నేడు రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలకు దిగింది. తిరుమలలో వసతి గదులపై పెంచిన అద్దెను వెంటనే తగ్గించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రిలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమలలో వసతి గదుల అద్దె పెంపును ఆయన ఖండించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso REad: తిరుమలలో వసతి గదుల అద్దె పెంచడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళనలు.. ప్రభుత్వంపై సోము వీర్రాజు ఆగ్రహం..
‘‘భక్తులపై భారం పడుతున్నా టీటీడీ పట్టించుకోవడం లేదు. పెంపుపై ప్రభావం చూపే ముందు హిందూ మత సంస్థలను సంప్రదించి ఉండాలి. హిందూ దేవాలయాల్లోనే చార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాటేజీల అద్దె పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని సోము వీర్రాజు ఇటీవల టీటీడీని కోరారు. ఈ నిర్ణయం వెనుక గల కారణాలను టీటీడీ బోర్డు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.