రమణ దీక్షితులు: ఆది నుండి వివాదాలే

TTD former priest Ramana dheekshitulu controversy history
Highlights

రమణదీక్షితులు తీరిది

తిరుపతి: టిటిడి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు మొదటి నుండి వివాదాస్పదుడుగానే ముద్రపడ్డాడు. తాజాగా టిటిడిపై రమణ దీక్షితులు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి. రమణదీక్షితులుపై టిడిపి నేతలు విరుచుకుపడుతున్నారు. మరోవైపు టిటిడి పాలకవర్గం కూడ నష్టనివారణ చర్యలకు దిగుతోంది.

ఇటీవల కాలంలో శ్రీవారి కెంపు వజ్రం కన్పించడం లేదంటూ టిటిడి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణ దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. రమణ దీక్షితులు  టిటిడి పాలకవర్గంపై అనేక ఆరోపణలు గుప్పించారు. పోటులో నేల మాళిగలు ఉన్నాయనే అనుమానంతో తవ్వకాలు జరిపించారనే ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారమంతా టిటిడికి ఇబ్బందికరంగా మారింది.


కార్పోరేట్ శక్తులకు  ప్రముఖులకు రమణ దీక్షితులు టిటిడి ప్రధాన అర్చకుడిగా ఉన్నసమయంలో  పూజలు నిర్వహించారనే ఆరోపణలు కూడ ఉన్నాయి. తిరుమలకు రిలయన్స్ అధినేత సతీమణి నీతూ అంబానీ , కుమారుడు అనంత్ అంబానీ టిటిడి అతిథి గృహల్లో  ఉన్న సమయంలో ప్రైవేట్ పూజలు నిర్వహించారనే  ఆరోపణలు ఆయనపై వచ్చాయి.


అంతేకాదు 2009 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావడానికి గాను తన ఇంట్లోనే  రమణదీక్షితులు యాగం నిర్వహించారనే ప్రచారం సాగింది.ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది. టిటిడిలో  అర్చకులుగా పనిచేసేవారు  నిబంధనల ప్రకారంగా  ప్రైవేట్ యాగాలు, పూజలు నిర్వహించకూడదు. కానీ, రమణ దీక్షితులు ఈ రకంగా పూజలు, యాగాలు రమణదీక్షితులు చేశారని ఆయనపై విమర్శలు లేకపోలేదు. 

స్వామి వారికి వచ్చిన విరాళాల్లో సుమారు రూ.2 లక్షలను తన ఖాతాలోకి రమణ దీక్షితులు మళ్ళించుకొన్నారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. అయితే రూ.2 లక్షలను ఆయన తిరిగి దేవాలయానికి అందించడం 2008లో కలకలం రేపింది.

రమణదీక్షితులు  తన మనమడిని గర్భగుడిలోకి తీసుకెళ్ళడం కూడ వివాదాస్పదమైంది. రమణదీక్షితులుకు టిటిడి దేవాలయంలోని అధికారులకు మధ్య ఎప్పుడూ  గొడవలు జరుగుతూనే ఉండేవి. టిటిడి నిబంధనలను ఖాతరు చేయకుండా తన ఇష్టానుసారంగా రమణదీక్షితులు వ్యవహరించేవారని ఆయనకు వ్యతిరేకవర్గంగా ఉన్నవారంతా చెబుతుంటారు.

టిటిడిలో అక్రమాలు చోటు చేసుకొంటున్నాయని  రమణదీక్షితులు చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇటీవల కాలంలో ప్రకటించడం పెద్ద కలకలం రేపుతోంది.  ఈ ఘటన జరిగిన రెండు రోజులకే టిటిడి పాలకవర్గం సమావేశమై 60 ఏళ్ళు దాటిన వారిని అర్చకులుగా తొలగించాలని  టిటిడి నిర్ణయం తీసుకొంది. 

ఈ నిర్ణయంపై రమణ దీక్షితులు తీవ్రంగా స్పందించారు.  ఈ ఘటన జరిగిన తర్వాత  కెంపు వజ్రం కన్పించకుండాపోయిందని  ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈ విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి వినతిపత్రం సమర్పించారు. మే 8వ తేదిన  హైద్రాబాద్ లోటస్ పాండ్‌లో వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ ను కలవడం కూడ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.


 
 

loader