తిరుమల శ్రీవారికి 9,259 కిలోల బంగారు ఆభరణాలున్నాయన్నారు టీటీడీ ఈవో  సింఘాల్. బంగారం తరలింపుపై పూర్తి బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంక్‌దేనని ఆయన స్పష్టం చేశారు. తిరుమలలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల సమయంలో బంగారం తరలింపు జరగడం వల్ల పెద్ద ఇష్యూ అయ్యిందని సింఘాల్ తెలిపారు.

ఆ రోజే పంజాబ్ నేషనల్ బ్యాంక్ డాక్యుమెంట్లు చూసి బంగారాన్ని విడిచిపెట్టి వుంటే ఇంత రాద్ధాంతం అయ్యేది కాదన్నారు. బంగారం ఏ రోజైతే టీటీడీ చేతికి అందుతుందో అప్పుడు అది తమ పరిధి కిందకు వస్తుందని... అప్పటి వరకు అది తమకు సంబంధం లేదన్నారు.

18వ తేదీ బంగారాన్ని తమకు అప్పగించాల్సిందిగా తాము పీఎన్‌బీని కోరామన్నారు. చీఫ్ సెక్రటరీ గతంలో టీటీడీ ఈవోగా పనిచేశారని.. ఆయనకు ఇక్కడి వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి విచారణకు ఆదేశించి వుండవచ్చని సింఘాల్ అభిప్రాయపడ్డారు.

ఎలాంటి విచారణకైనా.. ఎవరొచ్చి ఏం అడిగినా తాము సమాధానం చెప్పడానికి సిద్ధమన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలో వద్దో టీటీడీ బోర్డు చూసుకుంటుందని సింఘాల్ స్పష్టం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో మంది ఎన్నో రకాల వస్తువులు సరఫరా చేస్తున్నారని.. వాటన్నింటిని మానిటరింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని అవి తమ చేతికి వస్తేనే అది టీటీడీదని లేకపోతే కాదన్నారు. టీటీడీలో ఆర్‌టీఐ చట్టం వర్తించకపోయినా ఈ కేసుకు సంబంధించిన ఏ డాక్యుమెంట్‌నైనా మీడియాకు ఇస్తామని సింఘాల్ పేర్కొన్నారు.