తిరుమలలో టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు చోరీ.. చివరకు ఏం జరిగిందంటే..
తిరుమలలో టీటీడీకి చెందిన ఓ ఎలక్ట్రిక్ బస్సు కనిపించకుండా పోయింది. ఎలక్ట్రిక్ బస్సును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశాడు.

తిరుమలలో టీటీడీకి చెందిన ఓ ఎలక్ట్రిక్ బస్సు కనిపించకుండా పోయింది. ఎలక్ట్రిక్ బస్సును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశాడు. తిరుమలలోని టీటీడీ ట్రాన్స్‌ఫోర్ట్ కార్యాలయం నుంచి అర్దరాత్రి దాటిన తర్వాత బస్సును ఎత్తుకెళ్లారు. ఉదయం గ్యారేజీలో బస్సు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు.. బస్సు చోరీకి గురైందని అనుమానించారు. వెంటనే అప్రమత్తమై చోరీకి గురైన బస్సును గుర్తించిపనిలో పడ్డారు. ఈ క్రమంలోనే నాయుడుపేట మండలం బిరదవాడలో చోరీకి గురైన ఎలక్ట్రిక్ బస్సును పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
అయితే ఈ బస్సును దొంగిలించిన వ్యక్తి శ్రీకాళహస్తి మీదుగా చెన్నై తరలించేందుకు యత్నించాడు. అయితే బిరదవాడకు చేరుకోగానే బస్సు బ్యాటరీ అయిపోవడంతో.. రోడ్డు పక్కన వదిలేసి పరారైనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఆలస్యంగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఎట్టకేలకు నాయుడుపేట మండలం బిరదవాడలో చోరీకి గురైన ఎలక్ట్రిక్ బస్సును గుర్తించారు. మరోవైపు నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
అయితే తిరుమల ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డిపై పోలీసులు సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారం రోజుల క్రితం కూడా టీటీడీకి చెందిన ఒక ఎలక్ట్రిక్ కారు కూడా మిస్సైన నేపథ్యంలో.. పోలీసులు ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వాహనాలు చోరీ గురైనప్పటికీ.. తమకు కనీసం సమాచారం చేయకపోవడంతో.. ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి పేరు చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ శేషారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చితే ట్రాన్స్‌పోర్టు జీఎంను సస్పెండ్ చేసే ఆలోచనలో టీటీడీ ఉన్నట్టుగా సమాచారం.
ఇక, తిరుమలలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండటంతో భక్తులు టీటీడీ అధికారులు తీరుపై మండిపడుతున్నారు. తిరుమలలో భద్రత చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.