Asianet News TeluguAsianet News Telugu

వేద విశ్వవిద్యాలయాన్ని కేంద్ర విశ్వవిద్యాలయంగా ప్రకటించండి: వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర విశ్వవిద్యాలయంగా నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌ను కోరారు

ttd chairman yv subba reddy meets union education minister ramesh pokhriyal ksp
Author
New Delhi, First Published Dec 9, 2020, 7:03 PM IST

టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర విశ్వవిద్యాలయంగా నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌ను కోరారు.

ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి వినతిపత్రం అందజేశారు. 2006లో టీటీడీ నేతృత్వంలో వేద విద్య వ్యాప్తి, పరిరక్షణ కోసం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయంగా ప్రారంభించామన్నారు.

2007లో యూజీసీ దీనిని రాష్ట్ర విశ్వవిద్యాలయం గా గుర్తించిందని చైర్మన్ వివరించారు. ఈ వర్శిటీ వేదాల్లో డిగ్రీ నుంచి పిహెచ్‌డి దాకా అనేక కోర్సులు నడుపుతోందని వైవీ తెలిపారు.

అలాగే వేద విద్యను ప్రోత్సహించడానికి టీటీడీ సొంతంగా వేద పాఠశాలలు నడపడంతో పాటు, దేశవ్యాప్తంగా 80 వేద గురుకులాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని సుబ్బారెడ్డి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

వేదం చదివిన వారిని ఆదుకోవడానికి ఆలయాల్లో వేద పారాయణం, పెన్షన్, అగ్నిహోత్రం ఆర్థిక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. 14 సంవత్సరాలుగా టీటీడీ నిర్వహిస్తున్న వేద విశ్వవిద్యాలయానికి యూజీసీ 2ఎఫ్ గుర్తింపు ఇచ్చిందనీ, ఇప్పుడు 12బి కేటగిరీ గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి.. రమేశ్‌ను కోరారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడు విద్యాసంస్థలకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల హోదా ఇచ్చిన విధంగా, ఎస్. వి వేద విశ్వవిద్యాలయానికి జాతీయ వేద విశ్వ విద్యాలయం హోదా ప్రకటిస్తే దేశంలో తొలి వేద విశ్వవిద్యాలయంగా గుర్తింపు లభిస్తుందని టీటీడీ ఛైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తద్వారా దేశవ్యాప్తంగా వేద విద్య వ్యాప్తికి తోడ్పాటు కలుగుతుందని సుబ్బారెడ్డి చెప్పారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం టీటీడీ ద్వారా వేద విద్య ఉన్నతికి కట్టుబడి ఉందని ఆయన కేంద్ర మంత్రికి విన్నవించారు.

మరోవైపు ఢిల్లీలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర కళాశాలలో తెలుగు, తమిళం, సంస్కృతం విభాగాల్లోని సీట్లలో టీటీడీ కోటాను పునరుద్ధరించాలని సుబ్బారెడ్డి మరో వినతి పత్రం సమర్పించారు.

2016 ముందు వరకు అమలైన ఈ కోటాను ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీ అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1961లో అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ శంకుస్థాపన చేసిన ఈ కళాశాలను ఢిల్లీల ని ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఒకటిగా టీటీడీ తీర్చిదిద్దిందని సుబ్బారెడ్డి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios