తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు రు. 188 కోట్లు కేటాయిస్తూ టిటిడి పాలక మండలి నిర్ణయం
తిరుఛానూరులో అన్నప్రసాదం కాంప్లెక్స్ ను రు.5.2 కోట్లతో నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది. ఒకటిన్నర సంవత్సరంలో ఈ సముదాయ నిర్మాణం పూర్తి చేయాలి నిర్ణయించారు.
ఈ రోజు తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా తిరుపతి పట్టణాభివృద్ధికి రూ.188కోట్లు వెచ్చించాలని కూడా పాలకమండలి నిర్ణయించింది.
ఇదే విధంగా తెలుగు రాష్ట్రాలలో చేపట్టనున్న ఎనిమిదో విడత మనగుడి కార్యక్రమం కోసం రూ.66.93లక్షలు కేటాయించారు. నవంబర్ 14న కార్తీక పౌర్ణమి రోజున ఈ కార్యక్రమం నిర్వస్తారు. నవంబర్ మాసాంతంలోఘనంగా తెలంగాణాలోని శంషాబాద్ శ్రీనివాస కల్యాణం నిర్వహించాలని కూడా టిటిడి నిర్ణయించింది.
మిగతా నిర్ణయాలకు సంబంధించి,అనంతపురం జిల్లా లేపాక్షిలోని గుప్తకామేశ్వరి ఆలయ అభివృద్ధికి రూ.1.60కోట్లు, మైదుకూరు లక్ష్మీనారాయణస్వామి ఆలయ అభివృద్ధికి రూ.26.5లక్షలు , పొదిలిలోని ఆలయ అభివృద్ధికి రూ.25లక్షలు, అమ్మవారి సింహాసనానికి బంగారు తాపడం కోసం రూ.2.67లక్షలు వెచ్చించాలని పాలకమండలి నిర్ణయించింది.
