అసెంబ్లీలో కూడా అబద్దాలకు దడికట్టినట్లుగా చెబుతుంది.
అవాస్తవాలను కూడా నిజాలుగా చెప్పటంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని మించింది లేదు. అందులోనూ అసెంబ్లీలో కూడా అబద్దాలకు దడికట్టినట్లుగా చెబుతుంది.అందుకు రెండు ఘటనలు ఉదాహరణలు నిలిచాయి. రిషితేశ్వరి అనుమానస్పద మరణంలోను, కరణం ధర్మశ్రీకి రుణమాఫీ జరిగిందని చెప్పటంలోనూ అధికారపార్టీ అసెంబ్లీలో అబద్దాలు చెప్పిందని తేలిపోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయమై వైసీపీ సభ్యురాలు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతుండగా టిడిపి సభ్యురాలు అనిత జోక్యం చేసుకున్నారు.
వివిధ కేసులను ప్రస్తావించిన అనిత రిషితేశ్వరి కేసులో ప్రభుత్వం పూర్తి న్యాయం చేసిందని అనిత చెప్పారు. అయితే, అనిత చెప్పిన మాటలను రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తీవ్రంగా ఖండించారు. తమకు ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. తమకు న్యాయం జరిగిందని ఎంఎల్ఏ చెప్పటం పూర్తి అబద్దమని మండిపడ్డారు. తమ కూతురు కేసు విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అసలు సభలో టిడిపి తమ ప్రస్తావన ఎందుకు తెచ్చిందంటూ మండిపడ్డారు. ఎంఎల్ఏ తమతో ఏనాడు మాట్లాడలేదన్నారు.
ఇక, రెండో అంశమైన కరణ ధర్మశ్రీ కి రుణమాఫీ చేయటం. రైతు రుణమాఫీ గురించి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకున్నారు. అందరికీ ప్రభుత్వం వ్యవసాయ రుణాలను రద్దు చేస్తోందని, లబ్దిదారుల్లో వైసీపీ నేత కరణం ధర్మశ్రీ కూడా ఉన్నట్లు అసెంబ్లీలో చెప్పారు. ధర్మశ్రీకి రూ. 1.36 లక్షలు ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అదే విషయమై ధర్మశ్రీ స్పందిస్తూ తాను బ్యాంకులో రుణం తీసుకున్న రూ. 50 వేలు వడ్డీతో పాటు రూ. 51వేలకు చేరుకుందన్నారు. తనకు రూ. 1.36 లక్షల రుణం మాఫీ చేసినట్లు మంత్రి చెప్పటం పూర్తిగా అబద్దమని స్పష్టం చేసారు. ఈ రోజు సభలో ఈ రెండు అంశాలను వైసీపీ ప్రస్తావించగా అధికార పార్టీ నుండి సమాధానం లేదు.
