హైదరాబాద్‌: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, సినీ ఇండస్ట్రీతోపాటు అనేక వర్గాల నుంచి జగన్ కు అభినందనలు అందుతున్నాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత సైతం జగన్ కు అభినందనలు తెలిపారు. 

ప్రజల కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు అభినందనలు తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి కొడుకుగా గుర్తింపు పొందినప్పటికీ  జగన్ ప్రజల మధ్యలోనే ఎదిగారని, ప్రజలలోనే పెరిగారని వ్యాఖ్యానించారు. 

ప్రజలను నమ్ముకున్న ఏ నాయకుడు నష్టపోయినట్లు చరిత్రలో లేదన్న గట్టు రామచంద్రరావు, ప్రజలు లేకపోతే తానులేనుకునే నాయకుడు జగన్‌ ని ఆదరిస్తారన్నారు. సొంత పార్టీ పెట్టుకుని ప్రజల అభిమానాలు, ఆదరణను జగన్‌ పొందారని స్పష్టం చేశారు. 

గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తే కేవలం 5 లక్షల 40వేల ఓట్లు మాత్రమే వైసీపీ కంటే ఎక్కువగా వచ్చాయని, బీజేపీ లేకపోతే అన్ని ఓట్లు కూడా రావన్నారు. కేవలం ఒక్క ఎమ్మెల్యేతో పార్టీని స్థాపించి నేడు 67 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది ఎంపీలు సాధించి ఏపీలో బలమైన నేతగా జగన్‌ ఎదిగారని చెప్పారు. 

మరోవైపు కేంద్రంలో తనకు బలం సరిపోదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జాతీయ స్థాయిలో పొత్తుల కోసం ప్రయత్తిస్తున్నారని, ఏపీలో కూడా టీడీపీకి బలం సరిపోదని చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 

ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్ చేతిలో ఓటమిపాలయ్యారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికలు జగన్‌, ఆయన వ్యతిరేకుల మధ్యనే జరుగుతాయని, భవిష్యత్తులో జగన్ కు మంచి జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు గట్టు రామచంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు.